సమ్మెలో విషాదం
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:16 AM
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు.....
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్‌గౌడ్
పరిస్థితి విషమం.. కార్మికుల్లో తీవ్ర ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కొనసాగిన సమ్మె
పోలీస్ భద్రత మధ్య 45శాతం బస్సులు రోడ్లపైకి..
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు
సమ్మెపై మంత్రివర్గ సమావేశంలో చర్చ
కార్మిక సంఘం నేతలను చర్చలకు పిలిచిన ప్రభుత్వం
నేడు ఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో సమావేశం
రోజుకో తరహాలో నిరసన కార్యక్రమాలు: ఆర్టీసీ జేఏసీ
తొందరపాటు వద్దు.. ప్రాణం పోతే తిరిగిరాదు!
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నంపై సీఎం రేవంత్
సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని వ్యాఖ్య
చర్చలు సరిగా జరపలేదని అధికారులపై అసహనం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. బస్‌స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకున్నారు. ప్రయాణికులు, కార్మికులు వెంటనే మంటలు ఆర్పి ఆస్పత్రికి తరలించారు. శంకర్‌గౌడ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నల్లగొండ, ఖమ్మంలలో మరో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ వరుస పరిణామాలతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించడం, పోలీసులతో భద్రత ఏర్పాటు చేయడంతో గురువారం 45శాతం వరకు బస్సులు నడిచాయి. కాగా, రెండో రోజు సమ్మెలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో సమ్మె తదుపరి కార్యరూపం ఎలా ఉంటుందోననే అంశంపై నిఘా వర్గాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు వాహనాల దోపిడీ కొనసాగింది. రెండింతలకుపైగానే చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళన..
రాష్ట్రవ్యాప్తంగా గురువారం కూడా ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగింది. కార్మికులు విధులు బహిష్కరించి డిపోల ముందు, బస్‌స్టేషన్లలో నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు నిర్వహించారు. బస్సులు బయటికి రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. పలుచోట్ల సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులకు టెంట్లు, సామగ్రి సరఫరా చేయవద్దంటూ స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి టెంట్‌హౌస్‌ల నిర్వహకులకు ఆదేశాలు వెళ్లాయి. పలుచోట్ల వేసిన టెంట్లను కూడా తొలగించారు. దీనితో ఆర్టీసీ కార్మికులు ఎండలోనే ఆందోళనలు కొనసాగించారు. తమ సమ్మెకు అడ్డుపడొద్దని కోరుతూ కొన్నిచోట్ల కార్మికులు పోలీసు అధికారుల కాళ్లు పట్టుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఒక తాత్కాలిక డ్రైవర్ బస్సును డిపో నుంచి బయటికి తీస్తుండగా.. ఇద్దరు మహిళా కండక్టర్లు మంజుల, సునీత బస్సుపై కారం చల్లారు. దీనిపై డిపో మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
45శాతం బస్సులు రోడ్లపైకి!
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసులను మోహరించారు. బస్సుల్లోనూ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. ఈ క్రమంలో గురువారం సుమారు 45శాతం బస్సులు రోడ్డెక్కాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులు 98శాతం, అద్దె బస్సులు 95శాతం, ఆర్టీసీ బస్సులు 15శాతం నడిచాయని తెలిపారు. నారాయణపేట్, సిద్దిపేటలలో మాత్రం బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ఇక సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిన జనం చాలా వరకు ప్రయాణాలు మానుకున్నారు. అత్యవసరమైన వారు, ముందే ఇతర ప్రాంతాలకు వెళ్లి చిక్కుకున్నవారు మాత్రం బస్టాండ్లకు వచ్చారు. దీంతో ప్రధాన బస్టాండ్లు బోసిపోయి కనిపించాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో బస్సుల్లో కండక్టర్లు లేకపోవడంతో మహిళలతోపాటు పురుషులూ ఉచితంగానే ప్రయాణించారు.


ఏపీ నుంచి వివరాలు సేకరించిన యాజమాన్యం
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంపై సంస్థ యాజమాన్యం దృష్టి సారించింది. ఏపీలో ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో.. అక్కడి అధికారుల నుంచి వివరాలు తెప్పించుకుని పరిశీలించింది. ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల డ్రైవర్, కండక్టర్‌తోపాటు క్షేత్రస్థాయిలో కార్మికుల జీతాలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల స్థాయిలో ఉన్న వారికి మాత్రం ప్రస్తుతం అందుతున్న వేతనాల్లో కొంత వరకు కోతపడవచ్చని అంచనా వేస్తున్నారు. మరో ప్రధాన అంశమైన వేతన సవరణకు సంబంధించి.. 5శాతం నుంచి 7శాతం వరకు పేస్కేల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
తొందరపాటు చర్యలు వద్దు: మంత్రులు
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఆర్టీసీ సమ్మెపై చర్చ జరిగింది. కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లు, వాటికి పరిష్కారాలు, సమ్మె పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘‘ఆర్టీసీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు పరిష్కరించాం. పీఆర్సీ, ఉద్యోగుల విలీనం, సంఘాలకు గుర్తింపుపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కార్మికులెవరూ తొందరపాటు చర్యలకు పాల్పడవద్దు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. ఇక ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఆదుకోవడంతోపాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్మికులు సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే శక్తుల ఒత్తిడికి బలికావొద్దని మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. అనాలోచిత చర్యలకు పాల్పడి కుటుంబాలకు అన్యాయం చేయవద్దన్నారు. సమ్మె విరమించాలని కోరారు. ఇక ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యుల లాంటి వారని.. భావోద్వేగాలతో సమస్యలు పరిష్కారం కావని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తుందని.. ఆత్మహత్య వంటి ఆలోచనలు చేయవద్దని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు శుక్రవారం కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరపనున్నారు. చర్చల అనంతరం తక్షణమే పరిష్కారమయ్యే అంశాలపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశముంది.


నేటి నుంచి రోజుకో తరహాలో నిరసనలు: జేఏసీ
తమ 32 డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామ్‌సరెడ్డి చెప్పారు. మూడు ప్రధాన డిమాండ్లను పక్కనబెట్టి 29 అంశాలను పరిష్కరిస్తామని మంత్రి చెప్పిన మాటలతో కార్మికులు కలత చెంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సమ్మెలో రోజుకో విధంగా నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. శుక్రవారం బస్‌డిపోల ఎదుట మౌన ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత వరుసగా వంటా వార్పు, కార్మిక కవాత్, 27న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ, 28న మహిళా కార్మికుల బతుకమ్మ, 29న డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించామని థామ్‌సరెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నామని టీఎంయూ మాజీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.
బస్టాండ్ మధ్యలో నిలబడి.. పెట్రోల్ పోసుకుని..
తమ సమస్యలను పరిష్కరించాలంటూ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్‌గౌడ్ (55) ఆత్మహత్యాయత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తోటి కార్మికులతో కలిసి టీ తాగేందుకు సమ్మె శిబిరం నుంచి శంకర్‌గౌడ్ బయటికి వెళ్లారు. కాసేపటి తర్వాత ఒక బాటిల్‌లో పెట్రోల్ తీసుకుని బస్టాండ్‌లోకి వచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ.. పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని, నిప్పంటించుకున్నారు. అలా మంటల్లో కాలుతూనే.. పక్కనే ఉన్న బస్‌డిపో వైపు పరుగులు తీశారు. అది చూసిన ప్రయాణికులు, కార్మికులు, పోలీసులు మంటలు ఆర్పేసి.. నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని కాంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఆయనకు 80శాతం కాలిన గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, డిపో నుంచి అద్దె బస్సులను బయటికి పంపిస్తున్న తరుణంలో ఆర్టీసీ అధికారులతో శంకర్‌గౌడ్ వాగ్వాదానికి దిగారని.. ఈ క్రమంలో అధికారులు పరుష పదజాలంతో మాట్లాడటంతో ఆవేదన చెందారని తోటి కార్మికులు తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారని వెల్లడించారు. శంకర్‌కు దివ్యాంగురాలైన భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

మరో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
నర్సంపేటలో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం వార్తలు వచ్చిన కాసేపటికి నల్లగొండ బస్టాండ్ ప్రాంగణంలో మిర్యాలగూడ డిపో డ్రైవర్ వెంకన్న ఆత్మహత్యాయత్నం చేశారు. బస్టాండులోని నాన్‌స్టా్‌ప బస్ కౌంటర్ వద్ద నిలబడి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. సహచర కార్మికులు, పోలీసులు ఇది గమనించి వెంటనే ఆయనను ఆపారు. ఆయన వస్త్రాలను తొలగించి, నీళ్లు ఒంటిపై నీళ్లు పోశారు. మరోవైపు ఖమ్మం నగరానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ గూడూరి లింగారెడ్డి భద్రాచలం డిపోలో పనిచేస్తున్నారు. సమ్మె కారణంగా విధులకు వెళ్లని ఆయన గురువారం సాయంత్రం ఇంటి వద్ద పురుగుల మందు తాగారు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తమ సమస్యల పరిష్కారంపై ఆందోళనతోనే లింగారెడ్డి ఆత్మహత్యయత్నం చేశారని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. కాగా, వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న సమయంలో డ్రైవర్ శంకర్‌గౌడ్‌ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. శంకర్‌గౌడ్‌కు ఏదైనా జరిగితే సీఎం, మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎర్రబెల్లి అన్నారు.’
అఘాయిత్యాలకు పాల్పడొద్దు.. ఆదుకుంటాం: పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాత్రి కంచన్‌బాగ్ అపోలో ఆస్పత్రికి వెళ్లి డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తర్వాత పొన్నం మీడియాతో మాట్లాడారు. డ్రైవర్ శంకర్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ‘‘సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఎవరూ అధైర్యపడవద్దు. అఘాయిత్యాలకు పాల్పడవద్దు. ఆర్టీసీ కార్మికులు మా కుటుంబ సభ్యులే. గతంలో సమ్మెలు జరిగినప్పుడు పదుల సంఖ్యలో కార్మికులు చనిపోతే ఏ ఒక్క మంత్రి కూడా వచ్చి పరామర్శించలేదు. కానీ కార్మికుల పట్ల మా ప్రభుత్వానికి బాధ్యత ఉంది. మా సోదరులకు అండగా ఉంటాం’’ అని చెప్పారు. కాగా, శంకర్‌గౌడ్ మృతిచెందారని.. ఇది తెలిస్తే ఆర్టీసీ కార్మికులు భారీగా ఆందోళనకు దిగవచ్చనే ఉద్దేశంతో ప్రకటించలేదని ప్రచారం జరిగింది. అది అవాస్తవమని, ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన రేపేలా ఇలాంటి ప్రచారం చేయవద్దని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
