భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం
ABN , Publish Date - Oct 08 , 2026 | 06:19 AM
స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో గణనీయమైన వృద్ధి సాధించింది.
గత ఏడాదితో పోల్చితే 21.75 శాతం వృద్ధి
హైదరాబాద్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో గణనీయమైన వృద్ధి సాధించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు నమోదైన లావాదేవీలు, ఆదాయాన్ని గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 21.75 శాతం అదనంగా పెరిగింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య 9,33,471 దస్తావేజులు రిజిస్ర్టేషన్ కాగా, 2026-27లో ఇదే ఆరు నెలల వ్యవధిలో 9,49,496 డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్ అయ్యాయి. గత ఏడాదితో పోల్చితే 16025 లావాదేవీలు అదనంగా పెరిగాయి.
ఆదాయ పరంగా చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల వ్యవధిలో రూ.6,699.96 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.8,157.49 కోట్ల ఆదాయం పెరిగింది. గత సంవత్సరంతో పోల్చితే రూ.1457.53 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్ల ద్వారా గత ఏడాది రూ.5878.81 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.7047 కోట్లకు పెరిగింది. సుమారు రూ.1168.84 కోట్లు అదనం. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్ల ద్వారా గత సంవత్సరం ఇదే కాలానికి రూ.821.15 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.1138.66 కోట్లు వచ్చింది.
నెలవారీ గణాంకాలు పరిశీలిస్తే..
2025-26 (రూ.కోట్లలో) | 2026-27 (రూ.కోట్లలో) | |
ఏప్రిల్ | 1130.83 | 1242.90 |
మే | 1153.46 | 1521.11 |
జూన్ | 1125.53 | 1211.60 |
జూలై | 1113.62 | 1414.81 |
ఆగస్టు | 1019.56 | 1261.70 |
సెప్టెంబరు | 1054.29 | 1288.46 |
ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
అక్టోబరు జీతంతోనే 2 డీఏలు
Read Latest AP News And Telugu News