‘కరెంట్ కొంటాం.. అనుమతించండి’
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:20 AM
భవిష్యత్తులో విద్యుత్ కొరతను నివారించడంతో పాటు పీక్ డిమాండ్‌ను తట్టుకునేందుకు తెలంగాణ డిస్కమ్‌లు భారీ పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు రంగం సిద్ధం చేశాయి.
విద్యుత్ కొనుగోలుకు డిస్కమ్‌ల నిర్ణయం
ఈఆర్‌సీ అనుమతి కోరుతూ పిటిషన్లు
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో విద్యుత్ కొరతను నివారించడంతో పాటు పీక్ డిమాండ్‌ను తట్టుకునేందుకు తెలంగాణ డిస్కమ్‌లు భారీ పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లకు రంగం సిద్ధం చేశాయి. పవన, సౌర, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ, 24 గంటల పాటు నిరంతరంగా లభించే సంప్రదాయేతర విద్యుత్‌ను దీర్ఘకాలిక ప్రాతిపదికన కొనుగోలు చేసేందుకు నిర్ణయించాయి. ఈ మేరకు అనుమతి కోరుతూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ)లో డిస్కమ్‌లు పిటిషన్లు దాఖలు చేశాయి. ఇందులో భాగంగా 25 ఏళ్లకాలం పాటు 800 మెగావాట్ల పవన విద్యుత్, 3000 మెగావాట్ల సౌరవిద్యుత్‌ను సేకరించనున్నారు.
ఈ విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి, గంటకు 1000 మెగావాట్ల చొప్పున రోజుకు 6 గంటల పాటు విద్యుత్ అందించేలా 6000 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని డిస్కమ్‌లు యోచిస్తున్నాయి. అలాగే, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా రౌండ్ ది క్లాక్ కింద 2000 మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు, డిమాండ్ అత్యధికంగా ఉండే సమయాల్లో గంటకు 500 మెగావాట్ల చొప్పున 4 గంటల పాటు అందించే పీక్ లోడ్ విద్యుత్‌ను 15 ఏళ్ల పాటు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రానున్న సంవత్సరాల్లో రాష్ట్రంలో విద్యుత్ లోటు భారీగా పెరిగే అవకాశం ఉందని, 2027-28 నాటికి 4,120 మెగావాట్లుగా ఉండే లోటు, క్రమంగా పెరుగుతూ 35-36 నాటికి ఏకంగా 13,034 మెగావాట్లకు చేరుకుంటుందని డిస్కమ్‌లు అంచనా వేశాయి. ఈ కొత్త కొనుగోళ్లు 2029 ఆర్థిక సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై ప్రజల నుంచి ఈనెల 27 వరకు అభ్యంతరాలు, సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు.
ఇవి కూడా చదవండి...
గ్రామాల్లో ప్రపంచస్థాయి విద్య
రహదారుల నిర్మాణంలో భద్రతకే పెద్దపీట
15 రోజుల్లో డిపెండెంట్ ఆర్డర్లు!
Read Latest AP News And Telugu News