ఆయిల్‌పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యాచరణ: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Aug 26 , 2026 | 09:36 PM
తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు భారీ ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వరి పంటకు లాభదాయక ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ ఆయిల్‌పామ్ హబ్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ఆసక్తి కనబరుస్తోందని చెప్పారు.
కోదాడ - హుజూర్‌నగర్ నుంచే ఆయిల్‌పామ్ విస్తరణ ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సూర్యాపేట - ఖమ్మం -కొత్తగూడెం జిల్లాలతో భారీ ఆయిల్‌పామ్ కారిడార్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రైతుకు ఆదాయం.. సాగునీటికి పొదుపు.. రాష్ట్రానికి పరిశ్రమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతును వరి నుంచి మళ్లించాలంటే మెరుగైన ఆదాయం, మార్కెట్ భరోసా ఉండాలని అన్నారు. ఫార్మ్ టు ఇండస్ట్రీ విధానంలో ఆయిల్‌పామ్ సాగు - ప్రాసెసింగ్‌కు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. సబ్బులు, పామ్ ఆధారిత వినియోగ వస్తువుల తయారీకి భవిష్యత్‌లో అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3.12 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అవుతుందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 65,691 మంది రైతులు ఆయిల్‌పామ్ సాగులో భాగస్వామ్యం అయ్యారని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఆయిల్‌పామ్ విస్తరణకు ఇప్పటివరకు రూ.515.84 కోట్ల వ్యయం అయిందని వివరించారు. 2023 డిసెంబర్ తర్వాత కొత్తగా 1.29 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అవుతోందని స్పష్టం చేశారు. 2026 - 27లో మరో 21,230 ఎకరాలకు ఆయిల్‌పామ్ విస్తరణ చేస్తామన్నారు. సూర్యాపేటలో ప్రస్తుతం 5,753 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అవుతోందని వివరించారు.
ఆయిల్‌పామ్ తోటలతో స్థిరపడితే దాదాపు 30 ఏళ్ల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. భారీ ప్రాసెసింగ్ యూనిట్ కోసం FFB లభ్యతపై రిలయన్స్ క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తుందని తెలిపారు. త్వరలో కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెంలో రిలయన్స్ సంస్థ ప్రతినిధుల పర్యటిస్తారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
వరి కొనుగోలు, రవాణా, మిల్లింగ్, నిల్వపై ప్రభుత్వ భారాన్ని తగ్గించడమే లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయిల్‌పామ్ విస్తరణతో సాగునీటిపై ఒత్తిడి తగ్గించి రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఆయిల్‌పామ్ కార్యక్రమంతో ప్రస్తుతం 14 కంపెనీల అనుసంధానం అయ్యాయన్నారు. వంటనూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో తెలంగాణ కీలక పాత్ర వహిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది: దేవినేని ఉమా
చింతూరులో ఓఎస్డీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు..
For TG News And Telugu News