Share News

జగన్ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది: దేవినేని ఉమా

ABN , Publish Date - Aug 26 , 2026 | 07:37 PM

ఐదేళ్ల అరాచకాల పాలన మరిచిపోయి నేడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఏకగ్రీవాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. జగన్‌ రాజకీయ భవిష్యత్తుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు.

జగన్ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది: దేవినేని ఉమా
TDP Leader Devineni Uma

అమరావతి, ఆగస్టు26: ఐదేళ్ల అరాచకాల పాలన మరిచిపోయి నేడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఏకగ్రీవాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. జగన్‌ రాజకీయ భవిష్యత్తుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల సీఎం చంద్రబాబు కష్టానికి ప్రతిఫలమే వెలుగొండ ప్రాజెక్ట్ అని గుర్తు చేశారు.

పదవులు శాశ్వతం కాదు జగన్.. చేసిన అభివృద్ధే శాశ్వతమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతను మరిచి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై ప్రచురించిన పుస్తకాలను ఒక్కసారి చదువుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 48 ఏళ్ల అనుభవాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొంటున్నారని పేర్కొన్నారు.


నీవు చేసే పిల్ల చేష్టలు ప్రజలు చూస్తున్నారని చెప్పారు. పులివెందులకు నీళ్లు ఎవరిచ్చారో.. ఎలా వచ్చాయో రైతులు, ప్రజలను అడిగితే చెప్తారన్నారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఇరిగేషన్‌, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో బీసీలపై చేసిన అరాచకాలను మరిచిపోయి నేడు కపట ప్రేమ చూపిస్తూ శ్రీరంగనీతులు చెప్పడం జగన్‌కే చెల్లిందంటూ మండిపడ్డారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై విషం చిమ్మాలని జగన్‌ చేసిన కుట్రలను ఉపాధ్యాయులు తిప్పికొట్టారని వివరించారు.


శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల నుంచి చుక్క నీరు రాకపోయినా కృష్ణా డెల్టాను కాపాడుకున్నామంటే అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమన్నారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చిన 30 టీఎంసీల నీరు చూసైనా జగన్‌లో మార్పు వస్తుందని అనుకుంటే.. ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేకపోయారని తెలిపారు. వెలిగొండ, తోటపల్లి సహా రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు.


నేడు నిర్వాసితుల గురించి మాట్లాడుతున్న జగన్‌.. నాడు ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లపాటు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ పాటికి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యేవని పేర్కొన్నారు. తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ సమన్వయంతో కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాలను కాపాడుకుంటుంటే.. అసలు నీళ్లే రావంటూ జగన్‌ శాపనార్థాలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు నీళ్ల పట్ల శ్రద్ధ లేదు.. పంచభూతాలపై గౌరవం లేదని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చింతూరులో ఓఎస్డీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు..

భారీగా డిఫెన్స్ మద్యం బాటిళ్లు స్వాధీనం.. ఒకరి అరెస్ట్

For AP News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 07:43 PM