Share News

మహా బౌద్ధ స్థూపానికి పర్యాటక శోభ

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:14 AM

చుట్టూ పచ్చని పొలాలు.. పక్కనే దాదాపు 650-700 ఎకరాల విస్తీర్ణంతో బాలసముద్రం చెరువు.. దానికి ఆనుకుని శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మహా బౌద్ధ స్థూపం..! ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలోని ఈ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక సొబగులు అద్దనుంది.

మహా బౌద్ధ స్థూపానికి పర్యాటక శోభ
Nelakondapalli Buddhist Stupa

  • పర్యాటక అభివృద్ధిలో బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌లు..

  • తొలిగా ‘నేలకొండపల్లి-ముజ్జుగూడెం’ మాస్టర్‌ ప్లాన్‌

  • త్వరలో ప్రభుత్వానికి అందజేత

  • 700 ఎకరాల్లో బాలసముద్రం చెరువు అభివృద్ధి

హైదరాబాద్‌, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): చుట్టూ పచ్చని పొలాలు.. పక్కనే దాదాపు 650-700 ఎకరాల విస్తీర్ణంతో బాలసముద్రం చెరువు.. దానికి ఆనుకుని శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మహా బౌద్ధ స్థూపం..! ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలోని ఈ ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక సొబగులు అద్దనుంది. ప్రముఖ వారసత్వ, పర్యావరణ, పర్యాటక గమ్యస్థానంగా మార్చేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030ని తీసుకొచ్చింది.


ఇందు లో ప్రధానంగా ప్రకృతి, వైద్యం, ఆధ్యాత్మికంతో పాటు ప్రత్యేకంగా బుద్ధిస్ట్‌ సర్క్యూట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ సర్క్యూట్‌లో మొదటగా నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రెండో బౌద్ధ స్థూపం కావడం విశేషం. అక్కడ పురాతన బౌద్ధ కట్టడాలను సంరక్షిస్తూనే పర్యాటకులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. త్వరలోనే దాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు. దాని ప్రకారం.. బౌద్ధ స్థూపం అభివృద్ధిలో కీలకమైన బాలసముద్రం చెరువును అభివృద్ధి చేయనున్నారు. బోటింగ్‌తో పాటు వ్యూ ఏరియాలు, విశ్రాంతి ప్రదేశాలు, పచ్చిక మైదానాలు ఏర్పాటు చేయాల ని ప్రతిపాదించారు.


చెరువు సహజ స్వరూపం దెబ్బ తినకుండా, వృక్ష సంపదను సంరక్షిస్తూ పర్యావరణహిత సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. బౌద్ధ ప్రార్థనా మందిరం, సైట్‌ మ్యూజియం, తామర కొలను, ఆంఫీథియేటర్‌, సందర్శకుల సమాచార ప్రాంగణం వంటి సదుపాయాలను ప్రతిపాదించారు. క్షేత్ర చరిత్రను సులభంగా అర్థం చేసుకునేందుకు 3డీ కేంద్రం, ప్రదర్శనశాలలు, సమాచార ఫలకాలు, ప్రత్యేక నడక మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. 24 కాటేజీలు, 20 పడకల డార్మెటరీ, ఫుడ్‌ కోర్టు, స్థానిక ఉత్పత్తులు, జ్ఞాపికలు విక్రయించే దుకాణం ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనా భవనం, సిబ్బంది నివాసాలు, సామాజిక బహుళ ప్రయోజన హాలు, కార్యక్రమాల నిర్వహణకు పచ్చిక మైదానాలు, వినోద సదుపాయాలు, ఆటస్థలం ఏర్పాటు చేసేలా మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారు.


మహా స్థూపమే ప్రధాన ఆకర్షణ

నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రంలో మహాస్థూపం ప్రధాన ఆకర్షణ. సుమా రు 106 అడుగుల వ్యాసంతో విస్తరించిన ఈ భారీ ఇటుక నిర్మాణం తెలంగాణ బౌద్ధ వారసత్వానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది. 1970ల నుంచి వివిధ దశల్లో చేపట్టిన పురావస్తు తవ్వకాలు ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యాన్ని వెలుగులోకి తెచ్చాయి. తవ్వకాల్లో భారీ బౌద్ధ మహాస్తూపం, బావులు, నీటి నిల్వ నిర్మాణాలు, ఇటుక కట్టడాలు బయటపడ్డాయి. బుద్ధుడి శిల్పాలు, కంచు విగ్రహం, మట్టిబొమ్మలు, పాత్రలు, లోహ వస్తువులు, పురాతన నాణేలు, సున్నపురాయితో చెక్కిన చిన్న స్థూపం తదితర పురావస్తువులు లభించాయి. భిక్షువుల నివాస సముదాయాలు, నీటి వసతులు బయట పడటం ఇక్కడ ఒకప్పుడు వ్యవస్థీకృత బౌద్ధ కేంద్రం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. వాటన్నింటినీ తెలిపేలా మ్యూజియం నిర్మించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

వామ్మో రమ్మీ.. నమ్మొద్దు

రాష్ట్రంలో కొత్తగా 41 ‘2బీ’ బార్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 05:14 AM