Share News

వామ్మో రమ్మీ.. నమ్మొద్దు

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:06 AM

ఆన్‌లైన్‌ రమ్మీ పేరుతో గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల నిర్వాహకులు ఆటగాళ్లను స్వయంచాలక ‘బాట్స్‌’తో మోసం చేసిన విషయాన్ని ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.

వామ్మో రమ్మీ.. నమ్మొద్దు
ED Gameskraft case

  • ఆన్‌లైన్‌ రమ్మీలో మోసం!.. గేమ్స్‌ క్రాఫ్ట్‌పై మళ్లీ ఈడీ చర్యలు

  • రూ.442.35 కోట్ల ఆస్తులు అటాచ్‌

  • నిషేధం ఉన్నా తెలంగాణలోనూ గేమ్‌

  • ప్రచారానికే రూ.1,035 కోట్లు ఖర్చు!

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ రమ్మీ పేరుతో గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల నిర్వాహకులు ఆటగాళ్లను స్వయంచాలక ‘బాట్స్‌’తో మోసం చేసిన విషయాన్ని ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. తమ వేదికలు పారదర్శకంగా ఉంటాయని, ఆట న్యాయంగా జరుగుతుందని, స్వయంచాలక ప్రోగ్రామ్‌లను ఉపయోగించబోమని వినియోగదారులకు హామీ ఇచ్చిన ఈ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల నిర్వాహకులు ఆటగాళ్లకు తెలియకుండా లేదా వారి సమ్మతి లేకుండానే స్వయంచాలక ‘బాట్స్‌’ను రంగంలో దించారు.


దీంతో ఆటగాళ్లు భారీగా నష్టపోగా నిర్వాహకులకు భారీగా ఆదాయం సమకూరింది. ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరింత ఉచ్చు బిగించింది. రమ్మీ కల్చర్‌ యాప్‌ తదితర వాటికి సంబంధించి మరో రూ.442.35 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసినట్లు ఈడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. తాజాగా అటాచ్‌ చేసిన వాటిలో స్థిర డిపాజిట్లలోని నగదు, దుకాణాలు, విల్లా, నివాస ఆస్తులు ఉన్నాయి.


తెలంగాణ కేసులతో మొదలైన దర్యాప్తు

తెలంగాణలో నమోదైన పలు మోసం కేసుల ఆధారంగానే ఈడీ ఈ సంస్థలపై మనీలాండరింగ్‌ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది మే 7 నుంచి 14 వరకు, తర్వాత జూన్‌ 20 నుంచి 21 వరకు గేమ్స్‌క్రాఫ్ట్‌ కార్యాలయంతోపాటు సంస్థ డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గేమ్స్‌క్రాఫ్ట్‌ టెక్నాలజీస్‌, రమ్మీటైమ్‌ టెక్నాలజీస్‌ సంస్థలు రమ్మీకల్చర్‌, రమ్మీప్రైమ్‌, ప్లేషిప్‌, రమ్మీటైమ్‌ పేర్లతో నగదు ఆధారిత ఆన్‌లైన్‌ ఆటలు నిర్వహించినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.


దేశవ్యాప్తంగా ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌కు సుమారు మూడు కోట్లమంది వినియోగదారులు ఉన్నట్లు ఈడీ అధికారులు పేర్కొంటున్నారు. నగదు ఆధారిత ఆన్‌లైన్‌ గేమింగ్‌పై నిషేధం ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్నారని, ఆటగాళ్లు పందెంగా పెట్టే మొత్తంపై ఈ సంస్థలు 10-15 శాతం వరకు కమీషన్‌ వసూలు చేశాయని ఈడీ అధికారులు తెలిపారు. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు సుమారు రూ.1,035కోట్లను ప్రచారం, మార్కెటింగ్‌ కోసం ఖర్చు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.


కొన్ని సందర్భాల్లో నగదు ఉపసంహరణపై 5-10 శాతం వరకు రుసుం విధించడంతోపాటు, వెనక్కి తీసుకునే వీలున్న నగదును మళ్లీ ఆటలోనే వినియోగించేలా పథకాలు అమలుచేశారని పేర్కొన్నారు. అలా వచ్చిన నిధులను వాటాదారులకు డివిడెండ్లు, షేర్ల తిరిగి కొనుగోలు రూపంలో మళ్లించారని, ఆపై మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లు, షేర్లు, ఇతర పెట్టుబడులు, ఖరీదైన స్థిరాస్తుల్లోకి తరలించి.. కుటుంబ ట్రస్టులు, అనుబంధ సంస్థల ద్వారా అవి చట్టబద్ధమైన ఆస్తులుగా చూపించే ప్రయత్నం చేశారని ఈడీ అధికారులు వివరించారు.


ఈ కేసులో గతంలోనే రూ.495 కోట్ల విలువైన స్ధిర, చరాస్తులను స్తంభింపజేసిన ఈడీ మరో ఉత్తర్వు ద్వారా రూ.1,906 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. తాజా రూ.442.35కోట్ల అటాచ్‌మెంట్‌తో కలిపి ఈ కేసులో ఇప్పటి వరకు స్తంభింపజేసిన, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.2,843 కోట్లకు చేరినట్లు ఈడీ అధికారులు ప్రకటనలో వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:
మేడిగడ్డకు పూర్తిస్థాయి డయాఫ్రమ్‌ వాల్‌

రాష్ట్రంలో కొత్తగా 41 ‘2బీ’ బార్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 05:06 AM