మేడిగడ్డకు పూర్తిస్థాయి డయాఫ్రమ్ వాల్
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:51 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పునాదులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి రావచ్చని భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.
పునాదుల రక్షణకు బ్యారేజీ పొడవునా..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో దిగువన
కోతపడకుండా స్టిల్లింగ్ బేసిన్ల బలోపేతం
అవసరమైన చోట పునర్నిర్మాణం
ప్రస్తుతానికివి నిపుణుల ప్రతిపాదనలే..
రెండు, మూడు వారాల్లో తుది డిజైన్
వచ్చే ఖరీఫ్ నాటికి పునరుద్ధరణ: ఉత్తమ్
హుజూర్‌నగర్/ నేరేడుచర్ల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పునాదులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి రావచ్చని భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దిగువన ఉన్న స్టిల్లింగ్ బేసిన్లను బలోపేతం చేసి, మరింత పొడిగించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్.. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, గోదావరి జలాల వినియోగంపై కీలక వివరాలు వెల్లడించారు.
మేడిగడ్డ బ్యారేజీ పునాదుల కింద నుంచి నీటి లీకేజీని నియంత్రించి, పునాదులకు దీర్ఘకాలిక భద్రత కల్పించేందుకు బ్యారేజీ వెడల్పున డయాఫ్రమ్ వాల్ నిర్మించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. ఇక మూడు బ్యారేజీల వద్ద వరద నీటి వేగాన్ని అదుపు చేసేందుకు, బ్యారేజీల దిగువన కోత ఏర్పడకుండా ఉండేందుకు.. ప్రస్తుతమున్న స్టిల్లింగ్ బేసిన్లను పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇవి సాంకేతిక పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలు మాత్రమేనని స్పష్టం చేశారు.
జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) సూచించిన మట్టి, కాంక్రీట్, పునాదులకు సంబంధించిన పరీక్షలు దాదాపు పూర్తయ్యాయని.. పరీక్షల ఫలితాలను డిజైన్ సంస్థలు పరిశీలించి, ప్రతి బ్యారేజీ వద్ద చేపట్టాల్సిన నిర్మాణ పనులను ఖరారు చేస్తాయని ఉత్తమ్ తెలిపారు. రెండు, మూడు వారాల్లో తుది డిజైన్ సిద్ధమయ్యే అవకాశం ఉందన్నారు. నవంబర్‌లో లేదా ఆలస్యమైతే డిసెంబర్‌లో పునరుద్ధరణ పనులు ప్రారంభించి.. వచ్చే వానాకాలానికి(2027జూన్ నాటికి) పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
అత్యుత్తమ స్థాయిలో పునరుద్ధరణ..
కొత్త నిర్మాణాన్ని చేపట్టడం కంటే దెబ్బతిన్న బ్యారేజీలకు మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం సాంకేతికంగా క్లిష్టమైన ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ వివరించారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మూడు బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధమైందని, అవసరమైన చోట పునర్నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ పరిష్కారాలతో మూడు బ్యారేజీలను పూర్తిస్థాయి వినియోగంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.
గోదావరి జలాల వినియోగంలో సరికొత్త రికార్డు
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గినప్పటికీ 2025-26లో తెలంగాణ రికార్డు స్థాయిలో 340 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకే సంవత్సరంలో ఈస్థాయిలో గోదావరి జలాలను వినియోగించుకోవడం ఇదే తొలిసారని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఏ ఒక్క ఏడాది కూడా ఇంత భారీగా గోదావరి నీటిని వినియోగించ లేకపోయిందని విమర్శించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కను రైతుల అవసరాలను మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న నీటి సమస్యకు ఎల్‌నినో ఒక్కటే కారణం కాదని.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న లోపభూయిష్టమైన నిర్ణయాలతోనూ సమస్య నెలకొందని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును నిర్మించి ఉంటే 165 టీఎంసీల ప్రాణహిత జలాలను వినియోగించునే అవకాశం ఉండేదని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును పూర్తి చేయకుండా మేడిగడ్డకు మార్చారని.. అక్కడ నిర్మించిన బ్యారేజీల్లో తీవ్రమైన నిర్మాణ లోపాలు బయటపడ్డాయని పేర్కొన్నారు.
బీజేపీ ఓట్లచోరీకి పాల్పడుతోంది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఓట్ల చోరీకి పాల్పడుతోందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ చెబుతున్న విషయాలు ఇప్పుడు బహిర్గతం అయ్యాయన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
నేరేడుచర్ల, మఠంపల్లి మండలాల్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. నేరేడుచర్లలోజరిగిన సభలో మాట్లాడారు. ‘సర్’లో అక్రమాలు జరిగాయని, ఎన్నికల కమిషనర్లు పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల సందేహాలకు ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News