Share News

యూఎల్‌సీ ఊరట

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:30 AM

ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

యూఎల్‌సీ ఊరట
Ponguleti Srinivas Reddy

  • అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై నిర్ణయం

  • అర్జీలు త్వరితగతిన పరిశీలన.. అర్హత ఉన్నవి క్రమబద్ధీకరణ

  • సర్కార్‌ ఆదేశాలు.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ) దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూఎల్‌సీ కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని పొంగులేటి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆయన విలేకరులకు వెల్లడించారు.


గతంలో జారీ చేసిన జీఓ నం.455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్‌ యూఎల్‌సీ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా ఆదివారం మెమోనం.48062/ యూఎల్‌సీ/ఏ1/2026-1 జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. అర్హత కలిగిన కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియలు పూర్తిచేసి క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. యూఎల్‌సీ కింద పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం 2016లోనే జీఓ జారీ చేసినప్పటికీ, దాన్ని అమలు చేయలేదని పొంగులేటి తెలిపారు. ఫలితంగా పదేళ్లుగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. దాంతో ప్రజలు భూములపై హక్కులు, లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.


సహచర మంత్రులతో చర్చించి 22ఏ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌ విధానంలో పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ తర్వాత జీఓ118కు అనుగుణంగా మెమో జారీ, ఆ వెంటనే జీఓ76కు అనుగుణంగా మెమో ఇచ్చామన్నారు. 22ఏలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశామని పొంగులేటి పేర్కొన్నారు. ఇప్పుడు యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ఉత్తర్వులు ఇచ్చామని, మిగిలిన సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపుతామని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బాబోయ్‌ సుస్తీ

సైబర్‌ నారి వలపు వల 14.6 కోట్లకు టోకరా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 04:30 AM