బాబోయ్ సుస్తీ
ABN , Publish Date - Sep 28 , 2026 | 04:20 AM
తీవ్ర జ్వరం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, తల నొప్పి, జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు, శరీరంపై ఎర్రటి మచ్చలు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ. రెండు వారాలుగా రాష్ట్రంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఇల్లూ జ్వరం బారిన పడిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి.
రాష్ట్రాన్ని వణికిస్తున్న వైరల్ ఫీవర్లు
పెరుగుతున్న డెంగీ, మలేరియా కేసులు
వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం
దాదాపు 15 లక్షలపైనే జ్వర బాధితులు
అనధికారికంగా ఆ సంఖ్య 30 లక్షలపైనే..
రాష్ట్ర ప్రజారోగ్య విభాగం నిర్లక్ష్యం
ప్రజలకు అవగాహన కల్పించని వైనం
జ్వర సర్వేలు, క్యాంపుల ఊసే లేదు
డీఎంహెచ్‌వోలతో సమీక్షలే లేవు
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : తీవ్ర జ్వరం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, తల నొప్పి, జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు, శరీరంపై ఎర్రటి మచ్చలు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ. రెండు వారాలుగా రాష్ట్రంలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఇల్లూ జ్వరం బారిన పడిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే.. ఆ వెంటనే మిగతా కుటుంబ సభ్యులకూ ఫీవర్ సోకుతోంది. ఇలా కుటుంబాలకు కుటుంబాలు జ్వరాల బారినపడి తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్క రోజే కేవలం సర్కారు ఆస్పత్రులకు వచ్చిన ఔట్‌పేషంట్ల సంఖ్య 52,997. వీరిలో ఎక్కువ మంది వైరల్ ఫీవర్ బాఽధితులే కావడం గమనార్హం. రాష్ట్రంలో దాదాపుగా 15 లక్షల మంది విషజ్వరాల బారిన పడినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ లెక్కలు కేవలం సర్కారీ ఆస్పత్రుల్లో నమోదైనవే. ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌ల్లో చికిత్స పొందిన వారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కడం లేదు. అవి కూడా కలిపితే బాధితుల సంఖ్య 30లక్షలపైనే ఉంటుందన్న అంచనాలున్నాయి. రాష్ట్ర రాజధాని వైరల్ జ్వరాలకు అడ్డాగా మారింది. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర మంది వరకు జ్వర బాఽధితులు ఉన్నట్లు ప్రజారోగ్య విభాగం గణాంకాలు చెబుతున్నాయి. కానీ, క్షేత్ర స్థాయిలో ఆ సంఖ్య అంతకు పది రెట్లపైనే ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్‌లోనూ వైరల్ ఫీవర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వైరల్ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా సైతం విజృంభిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వైద్య శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6,238 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది తక్కువ కేసులు నమోదైనట్లు చెబుతున్నా.... సరైన పరీక్షలు, పర్యవేక్షణ లేకపోవడంతో డెంగీ విజృంభిస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3 వేలపైగా కేసులు నమోదైనట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డెంగీ విజృంభణ తీవ్రంగా ఉందని, 2వేలపైగా కేసులు వచ్చాయని లెక్కలు ఉన్నాయి. మేడ్చల్, వరంగల్, హనుమకొండ, ఖ మ్మం జిల్లాల్లోనూ డెంగీ కేసులు భారీగానే ఉన్నాయన్న అంచనాలున్నాయి. ఇక, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయు.
ప్రజారోగ్యం ఘోరంగా విఫలం...
ఒకవైపు డెంగీ, మరోవైపు విష జ్వరాలు విజృంభిస్తుంటే... రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల విభాగం మొద్దు నిద్రపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షల మంది ఆస్పత్రులకు క్యూ కడుతుంటే క్షేత్రస్థాయి జిల్లాల్లోని డీఎంహెచ్‌వోలతో ఒక్క సారి కూడా డీహెచ్ సమీక్ష నిర్వహించకపోవడం గమ నార్హం. జ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఇంటింటికి తిరిగి జ్వర సర్వే నిర్వహించాలి. బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలి. అక్కడ వైద్య శిబిరాలు నిర్వహించాలి. విష జ్వరాలు, డెంగీపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలి. క్షేత్రస్థాయి సిబ్బందిని పరుగులు పెట్టించాలి. కానీ.. ప్రజారోగ్య విభాగం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఆ విభాగంలో సమర్థుడైన అధికారి లేకపోవడంతోనే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మంత్రి దామోదర, సీఎం రేవంత్ ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
సర్కారీ దవాఖానాల్లో పరిస్థితి ఇదీ..
గత నెలలో సగటున ప్రతి రోజూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన ఓపీ 44,869గా ఉంటే, సెప్టెంబరులో అది 50,580కి పెరిగింది.
గత నెలలో 13,46,085మంది ఓపీలో చికిత్స పొందగా, ఈ నెలలో ఇప్పటికే 12,64,518 మంది చికిత్స పొందారు.
గత నెలలో బస్తీ దవాఖానాల్లో నమోదైన ఓపీ ఆరున్నర లక్షలు, ఈ నెలలో అది రెట్టింపైంది.
గాంధీ ఆస్పత్రిలోఆగస్టులో 50,964 ఓపీ నమోదు కాగా, సెప్టెంబర్‌లో 46,516 ఓపీలు వచ్చాయి.
భద్రాచలం ఆస్పత్రిలో ఈ నెలలో ఇప్పటివరకు 6634 ఓపీ కేసులు వచ్చాయి.
వేగంగా వైరల్ జ్వరాల వ్యాప్తి
వైద్యుల వద్దకు వచ్చే ప్రతి పది కేసుల్లో ఐదారు వైరల్ ఫీవర్ కేసులే ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ర్యాపిడ్‌గా జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇంట్లో ఒకరికి వస్తే..మిగతా అందరికీ వస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా వీటి బారినపడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పితో బాధితులు వస్తున్నారు. సాధారణంగా వైరల్ ఫీవర్ 2-3 రోజుల్లో తగ్గుతుంది. ప్రస్తుతం 4-5రోజులైనా తగ్గడం లేదని తెలుస్తోంది. జ్వరం తగ్గాక కూడా చాలా మంది నీరసం, పొడి దగ్గుతో బాధ పడుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే... వారు మాస్క్ ధరించాలి. వీలైతే ఒక గదిలో ఒంటరిగా ఉండాలి. ఇతర కుటుంబ సభ్యులకు సోకుకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా మంచి నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీరు తీసుకోవడం మంచిది.
- డాక్టర్ జలగం తిరుపతిరావు,
గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్
బోధనాస్పత్రుల్లో ఓపీ గణాంకాలు
ఆస్పత్రి | శనివారం నమోదైన ఓపీ | ఈ నెలలో నమోదైన ఓపీ |
ఉస్మానియా | 1717 | 55,867 |
గాంధీ ఆస్పత్రి | 1429 | 46516 |
ఖమ్మం | 1606 | 32835 |
మహబూబ్‌నగర్ | 1407 | 31657 |
నిజామాబాద్ | 1542 | 41306 |
మహేశ్వరం | 1433 | 29035 |
రామగుండం | 1164 | 25598 |
సిద్దిపేట | 1153 | 28378 |
రిమ్స్ ఆదిలాబాద్ | 1401 | 33745 |
వరంగల్ కాకతీయ | 1686 | 43641 |
ఈ వార్తలు కూడా చదవండి:
ఒకటే కార్డు.. మెట్రో, బస్సుల్లో రయ్ రయ్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News