Share News

ఉధృతంగా గోదావరి

ABN , Publish Date - Sep 28 , 2026 | 04:35 AM

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వచ్చిన వరద.. గోదావరిలో చేరడమే ఇందుకు ప్రధాన కారణం.

ఉధృతంగా గోదావరి
Bhadrachalam Godavari water

  • భద్రాచలం వద్ద 42.7 అడుగుల నీటిమట్టం

  • పోలవరం నుంచి 8.75 లక్షల క్యూసెక్కుల విడుదల

  • ఈ వరదంతా సముద్రంలోకే

  • వరద తీవ్రతతో పాపికొండల యాత్రకూ బ్రేక్‌

భద్రాచలం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి నుంచి వచ్చిన వరద.. గోదావరిలో చేరడమే ఇందుకు ప్రధాన కారణం. భద్రాచలంలో శనివారం అర్ధరాత్రి 12గంటలకు 35.8 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటలకు 39.7 అడుగులకు చేరింది. ఆ తర్వాత 9 గంటలకు 41 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 41.8 అడుగులకు, 3 గంటలకు 42.5 అడుగులు, 4 గంటలకు 42.7 అడుగులకు పెరిగింది. సాయంత్రం 6 గంటలకు 42.8 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నదిలోని స్నాన ఘట్టాలు నీట మునిగాయి.


అలాగే కరకట్టపైకి సందర్శకులను అనుమతించడం ఆపేశారు. అయితే, ఎగువన వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటి మట్టం క్రమేపీ తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, గోదావరి ఉధృతంగా ఉండడంతో పోలవరం ప్రాజెక్టు వద్దకు వరద పోటెత్తుతోంది. పోలవరం స్పిల్‌వే నుంచి 8,75,512 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసిన అధికారులు ఆ నీటిని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో పట్టిసీమ శివక్షేత్రాన్ని వరద చుట్టుముట్టింది. ఆలయానికి రాకపోకలు నిలిపివేశారు. ఇంకోవైపు. కృష్ణా డెల్టా, ఉమ్మడి పశ్చిమ డెల్టాల సాగునీటి అవసరాల కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు 7,788 క్యూసెక్కులు విడుదల చేశారు.


2 నెలలుగా గోదావరిలోనే గండిపోశమ్మ

దేవీపట్నం: ఏపీలోని పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామ ఆడపడుచు మాతృశ్రీ గండిపోశమ్మ అమ్మవారి ఆలయం రెండు నెలలుగా గోదావరిలో జలదిగ్బంధంలో ఉంది. జూలై నెల చివరి వారంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో.. ఉపనదులు పొంగి ప్రవహించి గోదావరి నదిలో చేరి ముంపు గ్రామాలను ముంచెత్తాయి. దీంతో గండిపోశమ్మ ఆలయం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. అప్పటి నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు దూరమయ్యారు. ఇక, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో జూలై నెలాఖరు నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను తాత్కాలికంగా ఆపేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

యూఎల్‌సీ ఊరట

సైబర్‌ నారి వలపు వల 14.6 కోట్లకు టోకరా!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 28 , 2026 | 04:35 AM