మీ పెట్టుబడులకు రక్షణ, లాభం
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:13 AM
తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల కు రక్షణ ఉందని, లాభం కూడా ఉంటుందని చెప్పారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది
2034 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
ఆరోగ్య రంగంలో పీహెచ్‌ఎఫ్ఐ కీలక పాత్ర పోషిస్తుంది: సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల కు రక్షణ ఉందని, లాభం కూడా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శనివారం ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ‘పబ్లిక్ హెల్త్ సైన్సెస్ సంస్థ (పీహెచ్‌ఎఫ్ఐ)’ క్యాం పస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, క్యాంపస్ మాస్టర్‌ప్లాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.
‘‘విద్య, వైద్యం, పరిశ్రమ లు, సేవారంగాల్లో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం. తెలంగాణకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు, హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంలో ఐఎస్‌బీ, నల్సార్ వంటి విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వైద్య రంగంలోనూ హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు పీహెచ్‌ఎఫ్ఐ వంటి సంస్థలు దోహదపడతాయి. ఆ సంస్థకు స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటా. గత నాయకులు దూరదృష్టితో తీసుకు న్న నిర్ణయాలే నేటి అభివృద్థికి పునాదులు. నెహ్రూ విద్య, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక మార్పులు దే శంలో సమాచార సాంకేతిక రంగం అభివృద్ధికి బాటలు వేశాయి. ప్రపంచంలోని ప్రముఖ ఫార్చ్యూన్-500 కంపెనీల్లో భారతీయులు ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారు. తెలంగాణలోని మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థి కూడా అమెరికాలో పనిచేసే వారితో పోటీపడే స్థాయికి ఎదగాలి’’ అని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రంలో గతంలో చంద్రబాబు, వైఎస్‌ఆర్, కేసీఆర్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన మంచి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. పెట్టుబడిదారులు, విద్యాసంస్థల విషయం లో తమకు ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ను రూపొందించామని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని.. 160 కిలోమీటర్ల రహదారికి కేంద్రం టెండర్లు పిలిచిందని, దక్షిణభాగాన్ని రాష్ట్రప్రభుత్వ పరిధిలోనే చేపట్టబోతున్నామని వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ సుమారు 10వేల చదరపుకిలోమీటర్ల పరిధిలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 10శాతానికి చేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు.
రాష్ట్ర పరిధిలోనే రీజినల్ దక్షిణభాగం నిర్మాణం
రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టులో దక్షిణభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుంది. సీఎం రేవంత్ పీహెచ్‌ఎఫ్ఐ క్యాంపస్ శంకుస్థాపన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దక్షిణ భాగం ప్రాజెక్టును రోడ్లు-భవనాల శాఖ పరిధి నుంచి తప్పిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు అనుబంధంగా ఉండే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్)కు అప్పగించింది. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగానికి సంబంధించిన అన్ని పనులను హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని పేర్కొంది.కానీ నిర్మాణ బాధ్యతలపై ఆ ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వకపోవడం తో.. డీపీఆర్ సహా అన్ని వ్యవహారాలను పూర్తిచేసి కేంద్రానికి నివేదిక సమర్పిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే నిర్మించనున్నామని సీఎం రేవంత్ తాజాగా తేల్చిచెప్పడంతో స్పష్టత వచ్చింది. నిజానికి 2023 డిసెంబరులో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకాగానే రీజనల్ రోడ్డుపై ఫోకస్ చేసింది. ఉత్తరభాగంలో భూసేకరణ ఒక కొలిక్కి రావడంతో.. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న దక్షిణభాగంపై దృష్టిపెట్టింది. తొలుత దీనిని కేంద్రమే నిర్మించాలని కోరింది. కానీ 2024 జూలైలో ఈ రోడ్డు అలైన్‌మెంట్, నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వమే చర్యలు చేపట్టింది. కానీ నిధులు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని దక్షిణభాగం పనులను చేపట్టడంటూ 2024 డిసెంబరులో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. భూసేకరణ వ్యయంలో 50 శాతం భరిస్తామని తెలిపింది. ఈ క్రమంలో దక్షిణభాగం నిర్మాణానికి కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత అడుగు ముందుకు పడలేదు. ఈ క్రమంలో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వమే దక్షిణభాగంపై కార్యాచరణ మొదలుపెట్టింది.
ఇవి కూడా చదవండి...
చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం