దీపావళికి నామినేటెడ్ ధమాకా!
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:35 AM
కాంగ్రెస్ నేతలకు ఈసారి దీపావళి పండుగ డబుల్ ధమాకా తీసుకురానుంది. పార్టీ నేతలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కార్పొరేషన్లు, కమిషన్ల చైర్మన్లు, సభ్యుల భర్తీకి ప్రభుత్వం దీపావళిని ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
కార్పొరేషన్లు, కమిషన్ల పోస్టుల భర్తీ
కొత్తవారికి పెద్ద సంఖ్యలో అవకాశం
ఆరు కార్పొరేషన్ల చైర్మన్లకు రెన్యువల్!
రైతు కమిషన్ చైర్మన్‌కూ కొనసాగింపు
మిగిలిన వాటిపై తర్జన భర్జన
ఎస్టీ కమిషన్‌ను విడిగా ఏర్పాటు చేసే యోచన
హైదరాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నేతలకు ఈసారి దీపావళి పండుగ డబుల్ ధమాకా తీసుకురానుంది. పార్టీ నేతలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కార్పొరేషన్లు, కమిషన్ల చైర్మన్లు, సభ్యుల భర్తీకి ప్రభుత్వం దీపావళిని ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టీజీఐఐసీ, శాప్ వంటి కీలకమైన ఆరు కార్పొరేషన్లు మినహా.. మిగిలిన కార్పొరేషన్లకు చైర్మన్లు, సభ్యులుగా కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఆయా కార్పొరేషన్లకు ఇటీవలి వరకూ చైర్మన్లు, సభ్యులుగా ఉన్నవారిని పార్టీ సేవలకు వినియోగించుకునే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై తర్జన భర్జన నడుస్తోంది. ఆరు కార్పొరేషన్లకు మాత్రం ఇటీవలి వరకు చైర్మన్లుగా ఉన్నవారినే తిరిగి నియమించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక విద్యా కమిషన్, రైతు కమిషన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిషన్ల చైర్మన్ల పదవీకాలం కూడా పూర్తయిన నేపథ్యంలో దీపావళి కల్లా వీటికీ చైర్మన్లు, సభ్యులను నియమించనున్నట్లు సమాచారం. రైతు కమిషన్‌కు కోదండరెడ్డినే కొనసాగించే అవకాశం ఉన్నట్లు, విద్యా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రం టీజేఎస్ నేత విశ్వేశ్వర్‌రావు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రైతు, విద్యా కమిషన్ల సభ్యుల సంఖ్యను పెంచే అవకాశం ఉందంటున్నారు. కాగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విడదీసి.. ఎస్టీ కమిషన్‌ను వేరుగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే ఈ రెండు కమిషన్లకు చైర్మన్లు, సభ్యులను నియమించనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లాల స్థాయిలో పీఏసీఎస్ అధ్యక్షులు, వివిధ దేవాలయాల కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల నియామకాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. నవంబరులో డీసీసీబీల చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టాలన్న యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా దీపావళి కల్లా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలన్న ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఉన్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
నెట్ జీరో క్యాంప్‌సగాఎన్‌ఐయూఎం ప్రాంగణం
Read Latest AP News And Telangana News And International