నెట్ జీరో క్యాంప్‌సగాఎన్‌ఐయూఎం ప్రాంగణం
ABN , Publish Date - Oct 20 , 2026 | 03:29 AM
పట్టణపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సమస్యల పరిష్కారంలో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ భారత ఫ్యూచర్ సిటీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐయూఎం) నూతన ప్రాంగణాన్ని నిర్మించనున్నారు.
హైదరాబాద్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పట్టణపాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సమస్యల పరిష్కారంలో పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూ భారత ఫ్యూచర్ సిటీలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐయూఎం) నూతన ప్రాంగణాన్ని నిర్మించనున్నారు. సుమారు రూ.200 కోట్లు ఇందుకు వెచ్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 20 ఎకరాల భూమిని కేటాయించింది. 2028 జూన్ 2 నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 2009లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్ కింద ఈ సంస్థ భవనానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో 20 ఎకరాలు కేటాయించడంతో నూతన ప్రాంగణ నిర్మాణానికి మార్గం సుగమం అయిందని పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
నెట్ జీరో క్యాంపస్
సహజ వనరులకు ప్రాధాన్యత ఇస్తూ నెట్ జీరో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు. సంజయ్ పూరి ఆర్కిటెక్ట్స్ ఈ ప్రాంగణానికి రూపకల్పన చేసింది. సహజ భూ స్వరూపానికి అనుగుణంగా భవనాలు నిర్మించనున్నారు. మూడింట రెండొంతుల భూమిని పచ్చదనం కోసం కేటాయిస్తారు. సౌర విద్యుత్తు, వర్షపు నీటి సంరక్షణ, నీటి నిల్వ జలాశయం, శుద్ధి చేసిన మురుగునీటి పునర్ వినియోగం ఏర్పాట్లు ఉంటాయి. పునర్ వినియోగ నిర్మాణ వ్యర్థాలు 80 శాతం వినియోగిస్తారు. మట్టి గుమ్మటాలు, జాలీ తెరలు, విశాలమైన పైకప్పు, సహజ గాలి ప్రసరణ ఉండే కిటీకీల నిర్మాణాలు ద్వారా భవనం చల్లగా ఉంచేలా రూపకల్పన చేశారు.
ఆరు పరిశోధనా కేంద్రాలు
కొత్త ప్రాంగణంలో పట్టణ పాలన, ఆర్థిక వనరుల సమీకరణ, మౌలిక సదుపాయాలు, సామాజిక- ఆర్థిక అభివృద్ధి, కార్పొరేట్ సామాజిక బాధ్యత, పట్టణ రవాణాపై పరిశోధనలు చేపడతారు. ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ కమిషనర్లు, పురపాలక శాఖ అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిదులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక సామర్ధ్య కేంద్రాలు అందుబాటులోకి తెస్తారు. పట్టణ సమస్యలకు పరిష్కారాలు అమలు చేసే ముందు ఇక్కడ ప్రయోగాత్మకంగా వాటి అమలు పరిశీలిస్తారు. పరిశోధకులు, సందర్శకుల కోసం 122 వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్
Read Latest AP News And Telangana News And International