ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట: సీతక్క
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:20 PM
నేర్పు.. ఓర్పు.. విజయం.. మహిళల సొంతమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలగా పని చేస్తూ మహిళలు విజయాలు సాధిస్తున్నారన్నారు.
హైదరాబాద్, మార్చి 08: నేర్పు.. ఓర్పు.. విజయం.. మహిళల సొంతమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలగా పని చేస్తూ మహిళలు విజయాలు సాధిస్తున్నారన్నారు. ఆదివారం నాడు బంజారాహిల్స్‌లోని కుమురం భీం ఆదివాసి భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి సీతక్క ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా స్వయం సహాయక సంఘం సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలను ఈ సందర్భంగా వారు ప్రారంభించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సెర్ఫ్ కుటుంబసభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామన్నారు. ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు వైద్య ఆరోగ్యశాఖకు ఆమె ధన్యవాదాలు చెప్పారు.
మహిళలకంటూ ఒకరోజు ఉండాలని ఐక్యరాజ్యసమితి 1975లో గుర్తించిందని గుర్తు చేశారు. ఇంతకు ముందు ఒక సోషలిస్టు జర్మనీ నాయకురాలు క్లారా జేట్కిన్ మహిళల సమస్యల మీద పోరాటాలు చేశారని వివరించారు. కర్మాగారాల్లో మహిళలకు వేతనాలు స్వల్పంగా ఉండేవన్నారు. కనీసం ఓటు హక్కు కూడా మహిళలకు లేదని చెప్పారు. కానీ మహిళలు పోరాటాలు చేసి తమ హక్కులను సాధించుకున్నారని వివరించారు. అవకాశం ఇస్తే అంతరిక్షంలోకి వెళ్తారని మహిళలు నిరూపించారన్నారు. కుటుంబాలు, పంట పొలాల నుంచి అంతరిక్షం వరకూ అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. పంట పొలాల్లో 80 శాతం పని మహిళలే చేస్తారని గుర్తు చేశారు.
ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేయాలని సంకల్పంతో పని చేస్తున్నామన్నారు. వినూత్న వ్యాపారాలతో ఆర్థికంగా ఎదుగుతున్న మహిళా సంఘాలను ఈ రోజు సన్మానించుకున్నామని చెప్పారు. వారు తెలంగాణ మహిళా సమాజానికి ఆదర్శప్రాయులని తెలిపారు. మహిళలు అందరి గురించి ఆలోచిస్తారు.. కానీ తమ గురించి ఆలోచించే సమయం వారికి దొరకదన్నారు. అందుకే మహిళలకు ఆరోగ్యంగా పని చేసే శక్తి ఉండేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఆడ పిల్లలు ఉన్నారని గుర్తు చేశారు. అందుకే వారికి ఆడవారి ఇబ్బందులు తెలుసునన్నారు. కాబట్టి మనకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తున్నారని పేర్కొన్నారు.
మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. లోన్ బీమాతోపాటు ప్రమాద బీమాతో వారికి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా లోన్‌లు ఇప్పించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. హైటెక్ సిటీలో రూ.వందల కోట్ల విలువైన మార్కెట్‌ను మహిళా సంఘాలకు అప్పగించామని గుర్తు చేశారు. సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ నాయకత్వంలో మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని వివరించారు.
ఇప్ప పువ్వు లడ్డూలు మొదలుకొని రైస్ మిల్లుల నిర్వహణ వరకు, ఆర్టీసీ అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్లకు మహిళలు ఓనర్లు అవుతున్నారని మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. బస్ స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో శిశువులకు పాలిచ్చే గదుల ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందుకు సంబంధించిన గదుల నమూనాను మంత్రులు సీతక్క, దామోదర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండారు శోభారాణితోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భగవద్గీతలో మాట తప్పని మడము తిప్పని అని మాటలేంటి?: స్వామి శ్రీనివాసానంద సరస్వతి
ఎన్టీఆర్ పురస్కారానికి చిరంజీవి ఎంపిక.. పల్లా శ్రీనివాసరావు అభినందనలు
For More TG News And Telugu News