ధరణి అక్రమాలపై ఉక్కుపాదం.. ఫాస్ట్‌ట్రాక్ విచారణ: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Aug 01 , 2026 | 07:34 PM
గత ప్రభుత్వ హయాంలో 'ధరణి' పోర్టల్ వేదికగా జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 01: గత ప్రభుత్వ హయాంలో 'ధరణి' పోర్టల్ వేదికగా జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో దృష్టి సారించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఫాస్ట్‌ట్రాక్ విచారణ ద్వారా బాధ్యులపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. ధరణి నుంచి నేటి 'భూభారతి' వరకు జరిగిన ప్రతి లావాదేవీపై సమగ్ర విచారణ జరుపుతామని, పేదల భూములను కాజేసిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
'భూధార్'తో సరికొత్త విప్లవం:
ప్రభుత్వం కొత్తగా ఒక్క అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితా (Prohibited List) లో చేర్చలేదని, గతంలో పెట్టిన జాబితాపై సమగ్ర పరిశీలన జరుగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 276 గ్రామాల్లో రీ సర్వే పూర్తయిందని వెల్లడించారు. ఇకపై ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ తరహాలో ప్రత్యేకమైన 'భూధార్' సంఖ్యను కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఒక స్పష్టమైన, సమగ్రమైన విధానాన్ని ప్రవేశపెడతామని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినప్పటికీ 'ఇందిరమ్మ ఇళ్ల' బిల్లుల చెల్లింపులు ఆపేది లేదని, లబ్ధిదారులకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. భూముల ధరల సవరణ వల్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం 10 నుంచి 20 శాతం వరకు పెరిగిందని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం దాదాపు రూ.18,000 కోట్లకు చేరే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: షాట్‌పుట్ భారత్‌కు రెండు పతకాలు
నీరజ్ చోప్రా తదుపరి జావెలిన్ ఈవెంట్ ఎప్పుడంటే..