Share News

ఎంబీబీఎస్‌ మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:58 AM

ఎంబీబీఎస్‌ మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన 363 కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకై మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిపికేషన్‌ విడుదల చేసింది.

ఎంబీబీఎస్‌ మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌
Telangana MBBS Counselling 2026

  • రేపు సాయంత్రం 5గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు

  • మాప్‌ అప్‌లో 363 కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ

  • కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన తర్వాత చేరకపోతే రూ.20లక్షల ఫైన్‌, మూడేళ్ల పాటు నిషేధం

  • సీట్లను బ్లాక్‌ చేయకుండా నిబంధన

  • రెండు ప్రైవేటు కాలేజీల్లో 50చొప్పున సీట్ల పెంపు

హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన 363 కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకై మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌కు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ నోటిపికేషన్‌ విడుదల చేసింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 14వ తేదీ(బుధవారం) సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్‌ సోమవారం ప్రకటించారు.నీట్‌-యూజీ-2026లో అర్హత సాధించి, కాళోజీ వర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్‌ జాబితాలో పేరున్న అభ్యర్థులు మాత్రమే వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అర్హులు. గతంలో నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయని వారికి ఈ విడతలో అవకాశం ఉండదు. గత విడతల్లో సీట్లు పొంది కళాశాలలో చేరకుండా ఉన్నవారు, చేరిన తర్వాత కోర్సును మధ్యలోనే వదిలేసినవారు కూడా అనర్హులుగా ప్రకటించారు.


అయితే, గత విడతల్లో సీట్లు పొంది, ప్రస్తుతం కోర్సు కొనసాగిస్తున్న అభ్యర్థులు మెరుగైన కళాశాలల్లో చేరేందుకు స్లైడింగ్‌ కోసం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కాగా, రాష్ట్రంలోని రెండు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్యను పెంచినట్లు వర్సిటీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. టీఆర్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కాలేజీల్లో.. ఒక్కో కళాశాలలో సీట్ల సంఖ్యను 150 నుంచి 200కు(50సీట్ల చొప్పున) పెంచారు. పెరిగిన సీట్లలో 50 శాతం కన్వీనర్‌ కోటా కింద, మిగిలిన 50 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా కింద భర్తీ చేయనున్నారు.


ఇదిలా ఉండగా, మాప్‌ అప్‌ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన తర్వాత చేరకపోయినా, చేరిన తర్వాత కోర్సును మధ్యలో నిలిపివేసినా కఠిన చర్యలు తప్పవని వర్సిటీ హెచ్చరించింది. నిబంధనల ప్రకారం రూ.20 లక్షల జరిమానా విధించడంతో పాటు, మూడేళ్లపాటు కాళోజీ వర్సిటీ పరిధిలో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు అనర్హులుగా ప్రకటించనున్నారు. సీట్లను బ్లాక్‌ చేయకుండా ఉండేందుకే ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు వర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రకటించిన ‘ఫ్రీ ఎగ్జిట్‌’ గడువు అక్టోబరు 8తో ముగిసినందున, ఆ తర్వాత ప్రవేశం పొందినవారికి అది వర్తించదని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

జేఎన్‌టీయూ వీసీ క్వార్టర్లను బార్‌లా మార్చారు

ఖమ్మంలో టీటీడీ శ్రీవారి ఆలయానికి శ్రీకారం

కాంగ్రెస్‌ది రాక్షస జాతి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 13 , 2026 | 05:58 AM