ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపునకు ప్రతిపాదనలు
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:30 AM
ఎల్‌ఆర్‌ఎస్ గడువును మరో మూడు నెలలపాటు పొడిగించాలని పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఓటర్ల సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియపై దృష్టి సారించలేకపోయినందున.. మరోసారి పొడగించాలని కోరినట్లు తెలిసింది.
ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపునకు ప్రతిపాదనలు
మరో 3 నెలలు పెంచాలని కోరిన కమిషనర్లు
నేటితో ముగియనున్న 25శాతం రాయితీ గడువు
ఇంకా పెండింగ్‌లోనే 4 లక్షల మందికి ప్రొసీడింగ్స్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్ గడువును మరో మూడు నెలలపాటు పొడిగించాలని పురపాలక శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఓటర్ల సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియపై దృష్టి సారించలేకపోయినందున.. మరోసారి పొడగించాలని కోరినట్లు తెలిసింది. ప్రభుత్వం కూడా ఇంకో అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2025లో తొలుత మార్చి నుంచి ఏప్రిల్ వరకు 25 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ తరువాత రాయితీ గడువును మే 31 వరకు కొనసాగించారు. సుమారు 20 లక్షల మంది దరఖాస్తుదారులకు ఫీజు చెల్లించాలని లేఖలు పంపగా అందులో 7 లక్షల మంది వరకు ఫీజు చెల్లించారు. ఆ తరువాత ఈ ఏడాది మే 1 నుంచి జూలై 31 వరకు మూడు నెలల పాటు 25 శాతం రాయితీకి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మరోసారి దరఖాస్తుదారులకు అవకాశం కల్పించింది.
ప్రస్తుతం ఈ గడువు కూడా నేటితో ముగియనుండటంతో ఇంకో అవకాశం ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో ఫీజు చెల్లించిన వారికి సకాలంలో ప్రొసీడింగ్స్ ఇవ్వడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని, ఫీజు చెల్లించాక ఏదో ఒక కొర్రీ వేసి నిలిపివేస్తున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య ముఖ్యంగా కోర్ అర్బన్ పరిధిలో ఉన్న జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో ఉంది. సుమారు 4 లక్షల మందికి ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన ప్రొసీడింగ్స్ ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా.. అధికారుల్లో కదలిక ఉండటం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
ఇవీ చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు