రిటైర్డ్ ఐపీఎస్ భూమికి ఎసరు
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:07 AM
కష్టపడి, రూపాయి రూపాయి కూడబెట్టి భూమినో, ఇంటిస్థలాన్నో కొనుక్కున్నవాళ్లకు నిశ్చితంగా ఉండటానికి లేకుండా.. రికార్డుల్లో పేర్లు తారుమారవుతున్నాయి.
రికార్డుల్లో పేరు తారుమారు..
భూభారతి మాటున కుంభకోణం
అసైన్డ్‌భూమి కబ్జా విచారణలో వెల్లడి
రంగంలోకి రెవెన్యూ యంత్రాంగం, సీఐడీ
బోరబండ ప్రాంతంలోని ఓ ముఠా పని
తప్పుడు పత్రాలతో, సీసీఎల్‌ఏ వెబ్‌సైట్ హ్యాక్ చేసి అక్రమాలు?
అదుపులో 9 మంది నిందితులు
రెవెన్యూశాఖ సిబ్బంది సహకారంపై సందేహాలు
జోగిపేట/జోగిపేట రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కష్టపడి, రూపాయి రూపాయి కూడబెట్టి భూమినో, ఇంటిస్థలాన్నో కొనుక్కున్నవాళ్లకు నిశ్చితంగా ఉండటానికి లేకుండా.. రికార్డుల్లో పేర్లు తారుమారవుతున్నాయి. అవసరం కోసం ఆ స్థలాన్ని అమ్ముదామని చూస్తే.. అప్పటికే వేరొకరి పేరు మీదకి బదిలీ అయిపోతోంది. సామాన్యుల భూములకే కాదు, ఏకంగా ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారి భూమికే రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో భూముల రికార్డుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలియజేసే ఉదంతం ఇది. 18 ఏళ్ల క్రితం ఐపీఎస్ అధికారి ఈశ్‌కుమార్ చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమిని, ఆయనకు తెలియకుండా మరో వ్యక్తి పేరిట మార్చేసిన వైనం సంగారెడ్డి జిల్లా అందోలు మండలంలో చోటు చేసుకుంది. ఈ భూదోపిడీ అనుకోకుండా బయటపడింది. ఆ భూమి పక్కనే ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమి కబ్జాకు గురికావటంతో.. స్థానిక రైతులు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరపటంతో ఈశ్‌కుమార్ భూమి రికార్డుల్లో పేరు మారిన విషయం వెలుగులోకి వచ్చింది.
కబ్జా నేపథ్యంలో వెలుగులోకి..
సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గ పరిధిలోని అందో లు మండలం సంగుపేట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 329/2లో ఉన్న 4.27 ఎకరాల వ్యవసాయ భూమిని 18 ఏళ్ల క్రితం ఈశ్‌కుమార్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి ఆయన ఆధీనంలోనే ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భూభారతి’ రికార్డుల నవీకరణ నేపథ్యంలో.. ఈ భూమి మీర్ మురాద్ అలీ అనే వ్యక్తి పేరిట బదిలీ అయిపోయింది. అసలు యజమాని అయిన ఈశ్‌కుమార్‌కు ఈ విషయమే తెలియదు. ఆయన భూమిని ఆనుకొని ఉన్న 2.30 ఎకరాల భూమిని ఇటీవల ఓ వ్యక్తి కొనుగోలు చేసి దాంట్లో ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు పనులు చేపట్టారు.
ఈ క్రమంలో సింగూరు కాలువను ఆనుకొని, పక్కనే ఉన్న ఎకరా ప్రభుత్వ అసైన్డ్ భూమిని కబ్జా చేయటం కోసం ఫెన్సింగ్ వేశాడంటూ పొరుగునే ఉన్న స్థానిక రైతులు సదరు వ్యక్తి మీద రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి, అసైన్డ్ భూమి హద్దులను రికార్డుల ప్రకారం తనిఖీ చేశారు. ఆ పక్కనే ఉన్న 4.27ఎకరాల భూమి మీర్ మురాద్ అలీ పేరు మీద ఉన్నట్లు రికార్డుల్లో ఉండటంతో.. ఇక్కడ మీర్ మురాద్ అలీ ఎవరు? అని స్థానిక రైతులను ఆరా తీశారు. ఆ ప్రశ్నకు రైతులు ఆశ్చర్యపోయి.. ఆ పేరుతో ఎవరూ లేరని, ఆ భూమి ఓ పోలీసు ఉన్నతాధికారిదని చెప్పారు. అధికారులు వెంటనే ఈశ్‌కుమార్‌కు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్నారు.
పాత రికార్డుల ఆధారంగా అక్రమాలు
తన భూమి మరొకరి పేరిట మారిపోయిందని తెలిసి ఈశ్‌కుమార్ హైదరాబాద్‌లోని రెవెన్యూ ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు, దీనిపై లోతైన విచారణకు ఆదేశించారు. సీఐడీ రంగంలోకి దిగి రికార్డులను పరిశీలించడంతో ఈ అక్రమ వ్యవహారం బయటపడింది. ఈశ్‌కుమార్ భూమితోపాటు, సంగుపేట శివారులోనే ఓ రెవెన్యూ ఉద్యోగి పేరిట ఉన్న 28 గుంటల భూమిని కూడా మురాద్ అలీ పేరిట మార్చినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ పరిధిలోని కొల్లూరులోనూ 4 ఎకరాల భూమి రికార్డుల్లో యజమాని బదులుగా వేరే వ్యక్తి పేరు నమోదు చేసినట్లు తెలిసింది. సంగారెడ్డితోపాటు మరో 13 జిల్లాల్లోనూ ఇదే తరహా భూ అక్రమాలు జరిగాయని వెల్లడైంది. వీటి వెనుక హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన ఓ ముఠా పని చేసినట్లు తెలిసింది.
1970 నుంచి ఉన్న పాత రికార్డులను ఆధారంగా చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించడం, వాటితో స్థానిక అధికారులకు కూడా తెలియకుండా.. ఏకంగా సీసీఎల్‌ఏ పోర్టల్‌లోని భూ యాజమాన్య రికార్డుల్లో మార్పులు చేయటం, అక్కడే మ్యుటేషన్‌లు చేయ డం వంటి అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు, ఎన్నారైలు, స్థానికంగా ఉండని వ్యక్తుల భూములనే ఈ ముఠా లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిసింది. దర్యాప్తులో భాగంగా సీఐడీ 9 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని వారిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా ఈశ్‌కుమార్‌కు చెందిన సదరు 4.27 ఎకరాల భూమితోపాటు ఇతరుల భూములను తిరిగి వారి పేర్ల పేరిటే అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. అయితే, ఈ భూ అక్రమాలు నిజంగానే హ్యాకింగ్‌తో జరిగాయా? సీసీఎల్‌ఏ పోర్టల్‌ను హ్యాక్ చేయటం సాధ్యమా? లేక, రెవెన్యూశాఖలో ఉన్న సిబ్బంది సహకారంతో ఎవరైనా చేశారా? దీంట్లో ఉన్నతాధికారుల పాత్ర ఏమిటి? వంటి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు
కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్
Read Latest Telangana News And Telugu News