అటెండర్ పోస్ట్‌కి రూ. 7 లక్షలు!
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:04 AM
టీచర్ ఉద్యోగం కావాలా? అయితే రూ. 4 లక్షలు అవుతుంది... మున్సిపల్ కార్యాలయం లో అటెండర్ ఉద్యోగం కావాలా.. అయితే రూ.7 లక్షలు...
ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్ట్‌కైతే 17 లక్షలు
ఐటీ మంత్రి వద్ద ఓఎస్డీనంటూ నిరుద్యోగులకు టోకరా
ఉద్యోగాలు ఇప్పిస్తామని.. 50.87 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
బాధితులు మంత్రి కార్యాలయానికి రావడంతో వెలుగులోకి వచ్చిన మోసం, పోలీసులకు ఫిర్యాదు
నిందితుల ఆట కట్టించిన టాస్క్‌ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : టీచర్ ఉద్యోగం కావాలా? అయితే రూ. 4 లక్షలు అవుతుంది... మున్సిపల్ కార్యాలయం లో అటెండర్ ఉద్యోగం కావాలా.. అయితే రూ.7 లక్షలు... ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్ట్‌కైతే రూ. 17 లక్షలు.. కాలేజీలో రికార్డు అసిస్టెంట్ పోస్టు కావాలంటే ఏకంగా రూ. 22.50 లక్షలు ఇచ్చుకోవాలి... ఏమిటిదంతా... ఉద్యోగాలు అమ్ముతున్నారా? అని అనుకుంటున్నారా..? అవును తెలంగాణ ఐటీ మంత్రి వద్ద ఓఎస్డీని అంటూ చెప్పుకొన్న ఓ వ్యక్తి, అతని ముఠా నిరుద్యోగులకు ఇలా కుచ్చుటోపీ పెట్టారు. ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు పెట్టి పలువురు నిరుద్యోగుల నుంచి మొత్తం రూ. 50.87 లక్షలు కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్‌కు చెం దిన కొలుగూరి రవికిరణ్ తాను ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీధర్‌బాబు పేషీలో ఓఎస్డీని అంటూ ప్రచారం చేసుకున్నాడు.
అందుకు అనుగుణంగా నకిలీ గుర్తింపు కార్డును, మంత్రి పేషీని పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించాడు. నిరుద్యోగులకు వల వేసి ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు కావాలన్నా ఇట్టే ఇప్పిస్తామంటూ రవికిరణ్‌తో పాటు అతని వెనుక ఉన్న ముఠా నమ్మబలికారు. అలా నమ్మిన వారిలో గట్టు జగదీష్ అనే వ్యక్తి నుంచి పాఠశాల విద్యాశాఖలో టీచర్ పోస్టు ఇప్పిస్తామని రూ.4లక్షలు తీసుకున్నారు. మున్సిపల్ శాఖలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని వంశీనాథ్ గౌడ్ వద్ద రూ. 7 లక్షలు, ఫుడ్ సేఫ్టీ అధికారిగా ఉద్యోగం ఇప్పిస్తామని భరత్ భూషణ్ అనే వ్యక్తి నుంచి రూ. 17,37,800, కళాశాలలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి వద్ద ఏకంగా రూ. 22.50 లక్షలు వసూలు చేశారు. కొంత కాలం గడిచాక బాధితుల నుంచి ఉద్యోగ నియామకాల కోసం ఫోన్‌లు రావడంతో రేపు... మాపు... అంటూ కాలయాపన చేశారు. తర్వాత స్పందించడం మానేశారు. దాంతో అనుమానం వచ్చిన బాధితులు మంత్రి శ్రీధర్‌బాబు పేషీకి వచ్చి సంప్రదించారు.
వారి వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించిన పేషీ అధికారులు రఘురాం శర్మ, ఇతర అధికారులు అవన్నీ నకిలీ లేఖలని గుర్తించారు. కొలుగూరి రవికిరణ్ పథకం ప్రకారమే మంత్రి ఓఎస్డీగా అవతారం ఎత్తి నిరుద్యోగులను మోసం చేసి అరకోటికి పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. అతనితో పాటు.. అతనికి సహకరించిన ముఠాపై చర్యలు తీసుకోవాలని నవంబరు 3న సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపారు. దీంతో సైఫాబాద్ పోలీసులతో కలిసి నిందితుల కోసం గాలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రవికిరణ్‌తో పాటు ఏపీకి చెం దిన రవికుమార్ అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిసింది. వారి వెనుక ఎవరున్నారు? ఏ ధైర్యంతో వీరు ఈ మోసానికి తెర తీశారు..? ఎక్కడెక్కడ ఇలాంటి మోసాలకు పాల్పడ్డారు..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు!
22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్ టికెట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News