ఎస్సారెస్పీ నిర్వాసితురాలికి 2 వారాల్లోపు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వండి: హైకోర్టు
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:01 AM
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో భూమి కోల్పోయిన ఓ మహిళకు 20 ఏళ్లయినా ప్రత్యామ్నాయ భూమి అప్పగించకపోవడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల పాటు వ్యవసాయ ఆదాయం కోల్పోయిన ఆమెకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం కొట్టేయడానికి నిరాకరించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో భూమి కోల్పోయిన ఓ మహిళకు 20 ఏళ్లయినా ప్రత్యామ్నాయ భూమి అప్పగించకపోవడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల పాటు వ్యవసాయ ఆదాయం కోల్పోయిన ఆమెకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం కొట్టేయడానికి నిరాకరించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నామని, ఈలోగా ఆమెకు ప్రత్యామ్నాయ భూమి పొజిషన్ అప్పగించాలని ఆదేశించింది. దాని తర్వాత రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమీక్ష చేస్తామని పేర్కొంది. నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్‌కు చెందిన దంతకాల చిన్నక్క అనే మహిళ ఎస్సారెస్పీలో భూమి కోల్పోయారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఆమెకు ఇంటి స్థలం, ప్రత్యామ్నాయంగా వ్యవసాయ భూమి ఇవ్వాల్సి ఉంది.
ఇంటి స్థలం, ఆమెపై ఆధారపడిన ఒకరికి ఉద్యోగం ఇచ్చినప్పటికీ ప్రత్యామ్నాయ భూమి మాత్రం కేటాయించలేదు. దాంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. రూ.10 లక్షల పరిహారంతో పాటు అమెకు ప్రత్యామ్నాయ భూమి, పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇవ్వాలని సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ, సీసీఎల్‌ఏ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది రమేశ్‌చంద్ర గౌడ్ వాదిస్తూ అధికారులు మిగులు భూమి కోసం పరిశీలిస్తున్నారని, రెండు వారాల్లో ఆమెకు ప్రత్యామ్నాయ భూమి కేటాయిస్తామని పేర్కొన్నారు. రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న డివిజన్ బెంచ్ భూమి పొజిషన్ అప్పగించిన తర్వాత అప్పీల్‌పై విచారణ చేపడతామని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
నవంబరు నెలాఖరులో.. హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ!
ఆయుధాల చోరీ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News