Share News

ఆయుధాల చోరీ కేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:53 AM

బొల్లారం 20 మద్రాస్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో నిందితుడు, మాజీ హవల్దార్‌ మల్లేష్‌ను పోలీసులు.. విచారణలో భాగంగా శనివారం సంఘటన స్థలానికి తీసుకెళ్లి ‘క్రైమ్‌ రీకన్‌స్ట్రక్షన్‌’ (జరిగిన తీరు) నిర్వహించారు.

ఆయుధాల చోరీ కేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌
Bollaram army weapons theft

  • కస్టడీలో భాగంగా నిందితుడిని విచారిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): బొల్లారం 20 మద్రాస్‌ రెజిమెంట్‌ బెటాలియన్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో నిందితుడు, మాజీ హవల్దార్‌ మల్లేష్‌ను పోలీసులు.. విచారణలో భాగంగా శనివారం సంఘటన స్థలానికి తీసుకెళ్లి ‘క్రైమ్‌ రీకన్‌స్ట్రక్షన్‌’ (జరిగిన తీరు) నిర్వహించారు. కోర్టు అనుమతితో నిందితుడిని 10 రోజుల కస్టడీకి తీసుకోవడం తెలిసిందే. అక్టోబరు 1 వరకు ఇది కొనసాగనుంది. ఆయుధాగారం, మందుగుండు నిల్వ కేంద్రాల పరిసరాలపై పూర్తి సమాచారం సేకరించిన తర్వాతే మల్లేష్‌ రంగంలోకి దిగినట్లు గుర్తించారు. ఇందుకోసం ఆగస్టు 27, 28, 29 తేదీల్లో 20 మద్రాస్‌ రెజిమెంట్‌లో రెక్కీ నిర్వహించాడు.


ఆదివారం గార్డ్‌ ఇన్‌ఛార్జ్‌లు, ఆర్మీ అధికారుల కదలికలు తక్కువగా ఉండడంతో అదే రోజు చోరీకి ప్రణాళిక వేసుకున్నాడు. ఆగస్టు 29న కౌకూరులో ఇనుపరాడ్డు కొనుగోలు చేసి, స్కూటీపై 30న (ఆదివారం) రాత్రి 11 గంటలకు రెజిమెంట్‌లోపలికి వెళ్లాడు. గదుల తాళాలు పగులగొట్టి.. ఏకే-203 రైఫిళ్లు, తుపాకులు, మందుగుండు సామాగ్రిని చోరీచేశాడు. మొదట స్కూటీపై 2 మూటలను తీసుకెళ్లి, సమీపంలోని గుడి వద్ద ఉంచాడు. మరో మూట కోసం వెనక్కి వెళ్లగా బెటాలియన్‌లో ఒక గార్డు ‘ఎవరు మీరు’ అని ప్రశ్నించగా.. 20 మద్రాస్‌ రెజిమెంట్‌ అని సమాధానం చెప్పాడు. మూడో మూటను గుడివద్ద భద్రపరిచిన మల్లేష్‌, తెల్లవారుజామున బాలాజీనగర్‌లోని ఇంటికి చేరుకున్నాడు. కారులో తిరిగి గుడి వద్దకు చేరుకుని ఆయుధాల మూటలను తీసుకొని.. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు తరలించినట్లు విచారణలో తెలుసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
‘ది ప్యారడైజ్‌’ చిత్రాన్ని చూసిన కేటీఆర్‌

రైస్‌ మిల్లర్ల బంద్‌ విరమణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 27 , 2026 | 05:53 AM