దసరా సెలవుల్లో కూల్చివేతలొద్దు
ABN , Publish Date - Oct 17 , 2026 | 06:42 AM
ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాల్లో ఉన్న స్థలాలు, ఆస్తుల విషయంలో హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది.
కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తుల జోలికి వెళ్లొద్దు
రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాల్లో ఉన్న స్థలాలు, ఆస్తుల విషయంలో హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 17 నుంచి 25 వరకు దసరా సెలవుల్లో ఎలాంటి కూల్చివేతలు, ఖాళీచేయించడం వంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, హైడ్రాకు సూచనలు జారీచేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి ఉత్తర్వులు జారీచేసింది. అయితే, వివాదాస్పద ఆస్తుల విషయంలో ఆయా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు చట్టప్రకారం నోటీసులు జారీచేసుకోవచ్చని సూచించింది.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం గ్రామపరిధిలోని సర్వే నెంబర్ 71/4లో తమకు ఉన్న 1. 20 ఎకరాల భూమిలో పశువుల షెడ్డు ఉండగా.. దానిని అధికారులు ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ ఆ గ్రామానికి చెందిన శీలం లీలావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. వివాదంలో ఉన్న ఆస్తి విషయంలో యథాతథస్థితి విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇదే తరహా వివాదాల్లో రెవెన్యూ అధికారులు దసరా సెలవుల్లో సైతం కూల్చివేతలు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని బార్ అసోసియేషన్ తరఫున పలువురు న్యాయవాదులు ప్రస్తావించారు. దీంతో దసరా సెలవుల్లో కూల్చివేతలు చేపట్టరాదని ఆదేశాలిచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
సింగరేణి కార్మికులకు బోనస్ బొనాంజా
వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం
Read Latest AP News And Telangana News And International