Share News

లేని గర్భిణులను ఎలా తేవాలి?

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:33 AM

రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆక్సలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌ (ఏఎన్‌ఎం)లపై గర్భిణుల నమోదు లక్ష్యాల భారం పెరుగుతోంది.

లేని గర్భిణులను ఎలా తేవాలి?
Pregnancy Registration Targets

  • సర్కారు టార్గెట్లతో ఏఎన్‌ఎంల ఆవేదన

  • నెలకు 8 మంది గర్భిణుల్ని గుర్తించాలని నిర్దేశం

  • ఇంటింటికీ తిరిగినా నెలకు ఒకరిద్దరే నమోదు

  • ఏఎన్‌ఎంలపై తీవ్ర మానసిక ఒత్తిడి

  • లక్ష్యాలను తగ్గించాలంటూ సర్కారుకు మొర

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆక్సలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌ (ఏఎన్‌ఎం)లపై గర్భిణుల నమోదు లక్ష్యాల భారం పెరుగుతోంది. వాస్తవంగా గర్భం దాల్చే మహిళల సంఖ్యకు, వైద్య ఆరోగ్య శాఖ నిర్దేశిస్తున్న లక్ష్యాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో ఏఎన్‌ఎం నెలకు కొత్తగా 8 మంది గర్భిణులను గుర్తించాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించింది.


ఈ ఏడాది జూలై వరకు ఈ టార్గెట్‌ 6గా ఉండేది. గర్భిణీల సంఖ్య తగ్గుతున్నప్పుడు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి కొత్తగా గర్భిణీలను ఎక్కడి నుంచి తీసుకురావాలని ఏఎన్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌) గణాంకాల ప్రకారం తెలంగాణలో మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎ్‌ఫఆర్‌) 1.5గా ఉంది. జనాభా స్థిరంగా కొనసాగడానికి అవసరమైన ప్రత్యామ్నాయ స్థాయి (2.1) కంటే ఇది తక్కువ. అయితే రాష్ట్రంలో గర్భిణీల నమోదు లక్ష్యాలను 1.8 టీఎ్‌ఫఆర్‌ ఆధారంగా లెక్కించినట్లు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.


24 శాతం అదనపు టార్గెట్‌!

గత ఏడాది వరకు మెటర్నల్‌ చైల్డ్‌ హెల్త్‌ (ఎంసీహెచ్‌) పోర్టల్‌ ఆధారంగా గర్భిణీల నమోదు లక్ష్యాలను నిర్దేశించేవారు. అయితే 2024-25 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అందించిన ఎస్టిమేటెడ్‌ లోడ్‌ ఆఫ్‌ యాంటీనేటల్‌ కేర్‌ (ఈఎల్‌ఏ) గణాంకాల ఆధారంగా కొత్త లక్ష్యాలను ఖరారు చేశారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో గర్భిణీల నమోదు లక్ష్యం ఏకంగా 25,696కు చేరింది. గత ఏడాది నిర్దేశించిన లక్ష్యంతో పోలిేస్త ఇది దాదాపు 6 వేలు అధికం. నిజామాబాద్‌ జిల్లాలో గర్భిణీల నమోదు లక్ష్యం 28,109 ఉండగా, దానికి 6,746 అధికంగా లక్ష్యం ఇచ్చారు. నల్లగొండ జిల్లా 7 వేలు పెంచారు. ఇతర జిల్లాల్లోనూ లక్ష్యాలు పెరిగినట్లు ఏఎన్‌ఎంలు, ఆశాలు చెబుతున్నారు. మొత్తంగా టార్గెట్స్‌ 24 శాతం పెంచారు.


తమ పరిధిలో గర్భిణీల నమోదు నుంచి వారి ప్రసవాల వరకు పర్యవేక్షణ బాధ్యత ఏఎన్‌ఎంలు, మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లపై ఉంటుంది. అయితే, గర్భం దాల్చే మహిళల సంఖ్య తగ్గుతున్న తరుణంలో నమోదు లక్ష్యాలను పెంచడంతో సిబ్బందిపై మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో యువ దంపతుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. చాలామంది ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. వారిలోనూ ఎక్కువ మంది పెళ్లి కాగానే పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. దాంతో సర్కారు నిర్దేశించిన టార్గెట్‌లో 50 శాతం కూడా సాధ్యం కావటం లేదు.


ఈ నేపథ్యంలో గర్భిణీల నమోదు లక్ష్యాలను వాస్తవ సంతానోత్పత్తి రేటుకు అనుగుణంగా సవరించాలని కోరుతూ టీఎన్జీవోల మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ ఫోరం వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌కు సెప్టెంబరు 25న వినతిపత్రం సమర్పించింది. ప్రతినెలా కొత్తగా 8 మంది గర్భిణీలను గుర్తించటం కష్టంగా మారిందని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఏఎన్‌ఎం తెలిపారు. కొందరు వ్యక్తిగత విషయాలను చెప్పడానికి ఇష్టపడటం లేదని, మరికొందరు గర్భధారణ నిర్ధారణ అయినా బయటకు చెప్పటం లేదని చెప్పారు. సంతానోత్పత్తి రేటు ఆఽధారంగా లక్ష్యాన్ని నిర్దేశించాలని ప్రభుత్వాన్ని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

సింగరేణి కార్మికులకు బోనస్‌ బొనాంజా

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 17 , 2026 | 04:33 AM