పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై హైకోర్టులో విచారణ
ABN , Publish Date - Mar 02 , 2026 | 05:41 PM
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్ట్‌ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
హైదరాబాద్, మార్చి 02: ఇవాళ(సోమవారం)జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్ట్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్, హరీశ్ రావు, ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన ఈ పిటిషన్లపై ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరఫున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసీఆర్ తరుపున లాయర్లు వాదనలు వినిపించారు. సాక్షులు ఎవరైనా పిటిషనర్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే అప్పుడు నోటీస్ జారీ చేసి వారి వాదన వినాలని చట్టం చెబుతుందని కేసీఆర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. నివేదికలో తీవ్ర ఆరోపణలు చేయడం , పిటిషనర్ పరువు, కీర్తికి నష్టం కలిగేలా చేయడం సరైంది కాదని హైకోర్టుకు తెలిపారు.
ఇదే సమయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కూడా పలు అంశాలను ప్రస్తావించారు. 'కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. కేసీఆర్, హరీశ్ రావుకు విచారణ కమిషన్ తగిన అవకాశం ఇచ్చింది. తన విధులు నిర్వహించడం లో స్మితా సబర్వాల్ విఫలం అయ్యారని నివేదిక లో ఉంది' అని ప్రభుత్వం తరఫు లాయర్లు హైకోర్టు ధర్మాసనంకు తెలియజేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపు(మంగళవారం) మధ్యాహ్నం 2.15 కి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?
గల్ఫ్‌లో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం: మంత్రి కొండపల్లి