చంద్రగ్రహణం.. హోలీ పండగ ఎప్పుడు..?
ABN , Publish Date - Mar 02 , 2026 | 03:27 PM
రంగుల పండగ.. హోలీని దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోంటారు. ఈ ఏడాది పాల్గుణ మాసం పూర్ణిమ తిథి మార్చి 2వ తేదీ సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభమవుతుంది.
రంగుల పండగ.. హోలీని దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోంటారు. ఈ ఏడాది పాల్గుణ మాసం పూర్ణిమ తిథి మార్చి 2వ తేదీ సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభమవుతుంది. మార్చి 3వ తేదీ సాయంత్రం 5.07 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. హోలీ పండగ జరుపుకునే తేదీని నిర్ణయించడంలో పౌర్ణమి తిథి కీలకం. మార్చి 4వ తేదీన రంగులతో హోలీ సంబరాలు జరుపుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మార్చి 2వ తేదీ హోలికా దహన్ జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు.
మార్చి 3 తేదీ మధ్యాహ్నం 3.00 గంటల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణానికి 9 గంటల ముందు అంటే.. ఉదయం 6.30 గంటల నుంచి సూతకం ప్రారంభమవుతుంది. ఈ సూతక సమయంలో ఆలయాల్లో పూజలు నిలిపివేస్తారు. ఎలాంటి పండగ వేడుకలు జరపకూడదు. ఈ చంద్రగ్రహణం సాయంత్రం 6.48 వరకు కొనసాగుతుంది. ఈ సూతక ప్రభావం మార్చి 3 రాత్రితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి దోషం లేకుండా మార్చి 4న రంగుల పండుగ హోలీ జరుపుకోవాలని ప్రజలకు పండితులు వివరిస్తున్నారు.
సంపూర్ణ గ్రహణ కాలం..
చంద్రగ్రహణం.. మంగళవారం (03-03-2026) మధ్యాహ్నం 3.20కు ప్రారంభమై.. 6.48 గంటలకు వీడుతుంది. సాయంత్రం 4.34 నుంచి 5.33 మధ్య సంపూర్ణ గ్రహణ కాలం ఉంటుంది. భారత్‌లో సాయంత్రం 6.20 నుంచి సుమారు 27 నిమిషాల పాటు ఈ గ్రహణం కనిపిస్తుంది. అండమాన్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు మినహా దేశంలోని మిగతా చోట్ల ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్‌లో మళ్లీ 2028 డిసెంబర్ 31వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.
దేవాలయాలు మూసివేత..
చంద్రగ్రహణం కారణంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లోని దేవాలయాలు మూసివేయనున్నారు. మంగళవారం ఉదయం 9 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దర్శనాలను నిలిపివేయనున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి.. పుణ్యాహవాచనం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతి ఇస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో..
ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలు.. తిరుమల శ్రీవారి ఆలయం, కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయం, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, చిన్న తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అన్నవరం శ్రీసత్యదేవుని ఆలయం, సింహచలం శ్రీలక్ష్మీ వరాహ స్వామి ఆలయం, శ్రీశైలంలోని శ్రీమల్లీకార్జున స్వామి వారి ఆలయం, తెలంగాణలో వరంగల్‌లో కొలువుదీరిన శ్రీభద్రకాళి అమ్మవారి ఆలయం, యాదాద్రిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జోగులాంబ దేవాలయంతోపాటు పలు దేవాలయాలను మూసి ఉంచనున్నారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం గ్రహణ సమయంలో ఆలయం తెరిచి ఉంచుతారు. ఈ గ్రహణ సమయంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. ఆకాశంలో ‘బ్లడ్‌మూన్’ కనువిందు..
For More Devotional News And Telugu News