రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. ఆకాశంలో ‘బ్లడ్‌మూన్’ కనువిందు..
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:19 PM
మంగళవారం రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్‌మూన్’ కనువిందు చేయనుంది. రేపు మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: రేపు (మంగళవారం) రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ‘బ్లడ్‌మూన్’ కనువిందు చేయనుంది. రేపు మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుంది. అయితే, దీని ప్రభావం మాత్రం 4.34 గంటల నుంచి మొదలవ్వనుంది. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో బ్లడ్‌మూన్‌ను చూడాలంటే సూర్యాస్తమయం వరకు వేచి చూడాల్సిందే. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కూడా సాయంత్రం 6 గంటల తర్వాతే బ్లడ్‌మూన్ ఉంటుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం కూడా తెలుగు రాష్ట్రాలకు ఉండనుంది.
ఎలా ఏర్పడుతుంది?
భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూ వాతావరణం సూర్యకాంతిని వక్రీకరించి, కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రునిపైకి ప్రసరింపజేస్తుంది. దీని వల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి.. దాన్ని 'బ్లడ్‌మూన్' అని పిలుస్తారు.
ఎన్ని గంటలు ఉంటుంది?
చంద్రునిపై భూమి నీడ దాదాపు ఒక గంట రెండు నిమిషాల పాటు పడనుంది. అయితే, ఇండియాలోని ప్రజలు బ్లడ్‌మూన్‌ను కొంత సమయం పాటు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. దేశంలోని చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాల పాటు బ్లడ్‌మూన్‌ను వీక్షించే అవకాశం ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దాదాపు 20 నిమిషాలకుపైగా సమయం వరకు గ్రహణాన్ని వీక్షించనున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భారతదేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలు అత్యంత అనుకూలమైనవి. ఈ ప్రాంతాల్లో త్వరగా చంద్రోదయం అవుతుంది కాబట్టి గ్రహణం ఎక్కువ సేపు ఉంటుంది. ఇటానగర్,గువహటి, సిలిగురి, కోల్‌కతా వంటి నగరాల్లో గ్రహణం అత్యంత స్పష్టంగా, ఎక్కువ సమయం పాటు కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరింత మంది అమెరికా సైనికులు మరణించినా.. ఇరాన్ యుద్ధం ముందుకే: డొనాల్డ్ ట్రంప్
శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ దాడులు.. వాటిపై ఫోకస్..