సీబీఐ రంగంలోకి దిగాలి!
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:31 AM
సెమ్ ఇండియా ఫ్యాబ్ కంపెనీ రూ.500 కోట్ల రుణం వివాదానికి సంబంధించిన కేసులో సీబీఐ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
సెమ్‌ఇండియాకు రూ.500 కోట్ల ఎస్‌బీఐ రుణం కేసులో హైకోర్టు సూచన
సీబీఐని ఇంప్లీడ్ చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సెమ్ ఇండియా ఫ్యాబ్ కంపెనీ రూ.500 కోట్ల రుణం వివాదానికి సంబంధించిన కేసులో సీబీఐ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు సీబీఐని సుమోటోగా ఇంప్లీడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాల కాపీలు, మధ్యంతర ఉత్తర్వులను సీబీఐకి అందజేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఫ్యాబ్‌సిటీ సెజ్‌లో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు కోసం సెమ్ ఇండియా కంపెనీకి 2007లో అప్పటి ప్రభుత్వం లీజు కింద 100 ఎకరాల భూమి ఇచ్చింది. దాదాపు రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం చేసుకుంది.
అయితే, పరిశ్రమ ఏర్పాటులో పురోగతి లేకపోవడంతో ప్రభుత్వం 2010లో భూమి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం భూమిలో 78 ఎకరాలు తిరిగి తీసుకోగా 22 ఎకరాలు కంపెనీ వద్ద ఉంది. సదరు కంపెనీ 2011లో భూమిని తాకట్టుపెట్టి ఎస్‌బీఐ నుంచి రూ.500 కోట్ల రుణాలు తీసుకుంది. ప్రభుత్వం ఆ భూమిని తిరిగి స్వాధీనపర్చుకుంటున్న క్రమంలో.. ఎస్‌బీఐ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం సెమ్ ఇండియా కంపెనీకి ఇచ్చిన ఎన్‌వోసీ ఆధారంగా భూమిని తాకట్టు పెట్టుకుని రూ.500 కోట్ల రుణాలు ఇచ్చామని, కంపెనీ తిరిగి చెల్లించనప్పుడు భూమి అమ్మకం ద్వారా రుణాల్ని రికవరీ చేసుకుంటామని తెలిపింది.
భూమిని తిరిగి స్వాధీనపర్చుకోవటానికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా రుణాలు పొందడానికి ఎన్‌వోసీ ఇచ్చామే కానీ ప్రభుత్వ భూమిపై యాజమాన్య హక్కు ఎస్‌బీఐకిగానీ, ప్రైవేటు కంపెనీకి గానీ బదిలీ కాదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఎస్‌బీఐ తీరును తప్పుపట్టింది. పరిశ్రమ ఏర్పాటులో ఎలాంటి పురోగతి చూపనప్పుడు, ఎక్కడి నుంచి రుణం తిరిగి చెల్లిస్తారనే ఆలోచన లేకుండా రూ.500 కోట్ల రుణం ఎలా ఇచ్చారని ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్
Read Latest Telangana News And Telugu News