సీఎం రేవంత్ రెడ్డి కుట్ర విఫలమైంది: కేటీఆర్
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:58 PM
బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్, జులై 17: బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ‘ రేపు (జూలై 18) సరూర్‌నగర్ స్టేడియంలో జరగబోయే యువ సంగ్రామ సదస్సును అడ్డుకొని, నిరుద్యోగ యువత గొంతు నొక్కుదామని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి కుట్ర విఫలమయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే... గౌరవ హైకోర్టు ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతూ, సదస్సుకు అనుమతి ఇచ్చింది’.
‘కాంగ్రెస్ ఎన్ని అవరోధాలు సృష్టించినా... యువత తరఫున బీఆర్ఎస్ పార్టీ గళం విప్పుతూనే ఉంటుంది. యువతీ యువకులారా.. తరలిరండి.. సరూర్‌నగర్ స్టేడియం వేదికగా కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం. రేవంత్ సర్కార్ మెడలు వంచుదాం. హామీల అమలుకు జంగ్ సైరన్ పూరిద్దాం. ఛలో సరూర్‌నగర్ స్టేడియం. రేపు ఉదయం 10 గంటలకు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎన్నిక వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యంగా యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని విమర్శించింది. అందుకోసం జులై 18వ తేదీన సరూర్ నగర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సదస్సుకు హాజరుకావాలని యువతకు పిలుపునిచ్చింది. ఈ సదస్సు కోసం బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం కోర్టు విచారణ జరిపింది.
శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందంటూ నిఘా వర్గాల నుంచి నివేదిక అందిందని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సదస్సు నిర్వహించే ప్రాంతంలో పార్కింగ్ ఏర్పాట్లు లేవని తెలిపారు. దాంతో 17 రోజుల క్రితం ఈ సదస్సు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ విషయాలను ఆ పార్టీ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదంటూ ప్రశ్నించింది. దీంతో ఈ సదస్సు నిర్వహణకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు మంజూరు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ
ఇతడి టాలెంట్ ముందు కంప్యూటర్ కూడా దిగదుడుపే.. వీడియో వైరల్..
For More TG News And Telugu News