Share News

7.56 లక్షల హెల్త్‌కార్డుల డౌన్‌లోడ్‌

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:26 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం అమల్లోకి తెచ్చిన న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఎన్‌ఈహెచ్‌ఎ్‌స)కు మంచి స్పందన లభిస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.

7.56 లక్షల హెల్త్‌కార్డుల డౌన్‌లోడ్‌
Telangana health cards

  • 919 ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం

  • 15,395 చికిత్సలకు రూ.104.63 కోట్ల చెల్లింపు

  • నగదు రహిత వైద్యానికి గొప్ప స్పందన : రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబ సభ్యుల కోసం అమల్లోకి తెచ్చిన న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఎన్‌ఈహెచ్‌ఎ్‌స)కు మంచి స్పందన లభిస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. జూలై 17న ప్రారంభమైన ఎన్‌ఈహెచ్‌ఎ్‌స పథకం పరిధిలోకి ఇప్పటికే 919 ఆస్పత్రులొచ్చాయని తెలిపింది. 15,395 చికిత్సలకు రూ.104.63 కోట్ల ముందస్తు అనుమతులిచ్చామని, వీటిలో 778 ప్రైవేటు, 141 ప్రభుత్వ ఆస్పత్రులున్నాయని పేర్కొంది.


ఉద్యోగులు, పింఛనుదారులతోపాటు అర్హులైన కుటుంబసభ్యులకు కూడా ఈ పథకం వర్తిస్తోందని, సెప్టెంబరు 1 నుంచి పోలీసుశాఖను కూడా పథకంలో చేర్చామని వెల్లడించింది. పథకం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసిందని, ఉద్యోగులు, పింఛనుదారుల బేసిక్‌ పే లేదా బేసిక్‌ పెన్షన్‌ నుంచి 1.5 శాతం చొప్పున జమ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని తన వాటాగా చెల్లిస్తోందని వెల్లడించింది. ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి నెలకు రూ.44 కోట్లు సమకూరుతుండగా, ప్రభుత్వం మరో రూ.44 కోట్లు అందిస్తోంది. దీంతో ప్రతి నెలా రూ.88 కోట్ల నిధి అందుబాటులోకి వస్తోంది.


ఇప్పటికే 3 నెలలకు సంబంధించిన నిధులను ట్రస్ట్‌కు బదిలీ చేశారు. ఈ పథకానికి వార్షిక బడ్జెట్‌ రూ.1,056 కోట్లు అంచనా వేశారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందే సేవలతోపాటు ఔట్‌పేషెంట్‌ సేవలనూ పథకంలో చేర్చారు. వెల్‌నెస్‌ కేంద్రా ల్లో వైద్యుల సంప్రదింపులు, పరీక్షలు, మందులను నగదురహితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం 12 జిల్లాల్లో 12 వెల్‌నెస్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరో 25 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో 21కేంద్రాలను వివిధ జిల్లా ల్లో, మరో నాలుగింటిని హైదరాబాద్‌, మేడ్చల్‌--మల్కాజిగిరి ప్రాం తాల్లో ఏర్పాటు చేయనున్నారు.


1,816 చికిత్స ప్యాకేజీలు

ఇన్‌పేషెంట్‌ వైద్య సేవలకు 1,816 సీజీహెచ్‌ఎస్‌ చికిత్స ప్యాకేజీలను అమలు చేస్తున్నారు. చికిత్సతోపాటు మందులు, పరీక్షలు, ఇన్‌ప్లాంట్లు, తదుపరి వైద్యసేవలను కూడా ప్యాకేజీల్లో చేర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ముందస్తు రిఫరల్‌ లేకుండానే సమీపంలోని ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రిలో చేరే అవకాశం కల్పించారు. హెల్త్‌కార్డు జారీ కాలేదన్న కారణంతో సేవలను నిరాకరించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగులు, పింఛనుదారులు తమ గుర్తింపు సంఖ్య ఆధారంగా వైద్య సేవలు పొందొచ్చు. సెప్టెంబరు 28 నాటికి 12,56,962 మంది కోసం హెల్త్‌కార్డులు అందుబాటులోకి రాగా, 7,56,210 మంది వాటిని డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. కాగా ఉద్యోగులకు సంబంధించిన 3,192 కేసులకు రూ.18.75 కోట్లు, వారి కుటుంబ సభ్యుల 5,669 కేసులకు రూ.39.52 కోట్లు అనుమతించారు. పింఛనుదారుల 4,042 కేసులకు రూ.29.27 కోట్లు, వారి కుటుంబ సభ్యుల 2,492 కేసులకు రూ.17.08 కోట్ల మేర ముందస్తు అనుమతులిచ్చారు.


పాత బకాయిల్లో రూ.70 కోట్ల విడుదల

కొత్త పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పాత ఈహెచ్‌ఎ్‌సకు సంబంధించిన బకాయిల్లో రూ.70 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.100.52 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులకు రూ.23.85కోట్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.76.67కోట్లు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించేందుకు రూ.19.23 కోట్ల విలువైన చెక్కులు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లబ్ధిదారుల కోసం 30 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో హెల్ప్‌డె్‌స్కలను ఏర్పాటు చేశారు.


ఇవి కూడా చదవండి...
తెలంగాణలో శ్వేత విప్లవం 2.0కు శ్రీకారం

పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్‌!

గుజరాత్‌ ‘చింతన్‌శివిర్‌’కు మంత్రి కోమటిరెడ్డి
Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 06:26 AM