సంతకాలు లేకున్నా జీఎస్టీ నోటీసులు సబబే
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:23 AM
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. జీఎస్టీ అధికారులు జారీ చేసే షోకాజ్ నోటీసులు, బ్యాంకు ఖాతాల జప్తు ఉత్తర్వులపై రాతపూర్వకంగా లేదా డిజిటల్ సంతకాలు లేకపోయినా అవి చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది.
అధికారి పేరు,హోదా ఉంటే చాలు: హైకోర్టు
జీఎస్టీ నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన 200కుపైగా పిటిషన్ల కొట్టివేత
రూ.1500 కోట్ల బకాయిల వసూలుకు ఓకే
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. జీఎస్టీ అధికారులు జారీ చేసే షోకాజ్ నోటీసులు, బ్యాంకు ఖాతాల జప్తు ఉత్తర్వులపై రాతపూర్వకంగా లేదా డిజిటల్ సంతకాలు లేకపోయినా అవి చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది. జీఎస్టీ షోకాజ్, అటాచ్‌మెంట్ ఆర్డర్‌పై అధికారి పేరు, హోదా ఉంటే చాలని పేర్కొంది. జీఎస్టీ విభాగం వినియోగిస్తున్న కంప్యూటర్ బేస్డ్ నోటీసు జారీ విధానాన్ని, అందుకోసం వినియోగిస్తున్న టెక్నాలజీని, డిజిటల్ కీ, డిజిటల్ సంతకం విధానాన్ని సమర్థించింది. ఈ మేరకు జీఎస్టీ నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన 200కు పైగా పిటిషన్లను కొట్టేసింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.1500 కోట్ల బకాయిలు ఆయా వ్యాపారులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వసూలు కానున్నాయి.
సంతకాలు లేకుండా జారీ చేసిన జీఎస్టీ నోటీసులు చెల్లవని, అవి చట్ట విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో దాదాపు 200కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. డిజిటిల్ సంతకాలు ఉంటాయని అధికారులు చెబుతున్నప్పటికీ సదరు నోటీసులను డౌన్‌లోడ్ చేసుకుంటున్నప్పడు డిజిటల్ సంతకాలు కాగితంపై కనిపించడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. ఈ పిటిషన్లపై తొలుత విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం సంతకాలతో కూడిన నోటీసులు మళ్లీ జారీ చేయాలని గతంలో తీర్పు ఇచ్చింది. అయితే అదే అంశంపై మరిన్ని పిటిషన్లు దాఖలు కావడంతో ఈ అంశంపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్, జస్టిస్ ఎన్ తుకారాంజీ, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది.
అన్ని వర్గాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. జీఎస్టీ కంప్యూటర్ బేస్డ్ నోటీసు జారీ ప్రక్రియను సమర్థించింది. డిజిటల్ సంతకాలు కనిపించినా కనిపించకపోయినా జీఎస్టీ నోటీసులు చట్టబద్ధమేనని పేర్కొంది. జీఎస్టీ నోటీసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జీఎస్టీ చట్టం నిర్దేశించిన విధానంలో అప్పీలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. అలాగే ప్రస్తుత కేసుల్లో ప్రభుత్వం జారీ చేసిన జీఎస్టీ డిమాండ్ నోటీసులకు సంబంధించిన బకాయిలను పిటిషనర్లు రెండు వారాల్లోగా చెల్లించాలని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
రేవంత్.. సిరిసిల్ల అభివృద్ధిని చూసి నేర్చుకో
Read Latest AP News And Telangana News And International News And Telugu News