గురుకుల ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించాలి
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:24 AM
గురుకుల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సొసైటీ కార్యదర్శి కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు.
సొసైటీ కార్యదర్శి కార్యాలయం ముట్టడించిన ఉద్యోగులు
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : గురుకుల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) పరిధిలో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సొసైటీ కార్యదర్శి కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయడంతో పాటు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సొసైటీ సహాయ కార్యదర్శికి అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ... గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, లైబ్రేరియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్‌మెన్లకు సత్వరమే పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను గౌరవ వేతనం రూపంలో చెల్లించడం వల్ల ఆ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ప్రాథమిక సౌకర్యాలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న అనేక మంది పాత ఉద్యోగులకు ఇప్పటికీ ‘ఐఎఫ్ఎంఐఎస్ ఐడీలు’ కేటాయించకపోవడం దారుణమన్నారు. అధికారులు స్పందించి సర్వీసు వివరాలను అప్‌లోడ్ చేసి, ‘ఐఎఫ్ఎంఐఎస్’ నంబర్లు కేటాయించి జీతాలు చెల్లించాలని, తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత బక్క జడ్సన్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ పుల్లగుర్ల రాజిరెడ్డి, నాయకులు రాంబాబు, రవీందర్, శ్రీకాంత్, లింగం, శ్రీధర్, మహేందర్, మౌనిక, మమత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News