గ్రామ పంచాయతీల బిల్లుల చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 08:18 PM
తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులకు ఎదురవుతున్న అడ్డంకులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులకు ఎదురవుతున్న అడ్డంకులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నూతన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై బిల్లుల చెల్లింపుల విషయంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య తలెత్తే విభేదాల కారణంగా చెక్కులపై సంతకాలు ఆలస్యం కాకుండా ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. చెక్కులపై సంతకం చేయాల్సిన ఉప సర్పంచ్ కారణం లేకుండా జాప్యం చేస్తే చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలిచ్చింది. ఉప సర్పంచ్ ఎలాంటి కారణం లేకుండా ఏడు రోజులకు మించి జాప్యం చేస్తే, సంబంధిత జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాల్సి ఉంటుంది. విచారణలో ఉద్దేశపూర్వకంగానే సంతకం చేయకుండా జాప్యం చేసినట్లు తేలితే, సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
సంతకాల విషయంలో అనవసర జాప్యం కొనసాగితే పంచాయతీల్లో అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపులు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైన సందర్భాల్లో ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో లేదా ఎంపీడీవోల్లో ఒకరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ తాజా ఆదేశాలతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు వేగవంతం కావడంతో పాటు, చెక్కుల సంతకాల విషయంలో నెలకొనే వివాదాలకు పరిష్కారం లభించినట్లు అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..
హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..