అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN , Publish Date - May 24 , 2026 | 07:56 PM
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, మే24: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పౌర సరఫరాలు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లపై ఆదివారం హైదరాబాద్‌లో సహచర మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రైతులకు చెల్లింపుల పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు.
తాలు, తరుగు పేరుతో కోతలు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుకు నష్టం చేసే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదన్నారు. కాంటా కోసం వేచి ఉన్న 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో ఆందోళన చెందవద్దని.. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుంటే.. మిల్లర్లు, కొనుగోలు సిబ్బందిపై కఠిన చర్యల తప్పవని హెచ్చరించారు.
రైతుల్లో గందరగోళం సృష్టించవద్దంటూ అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఖరీఫ్, రబీ కలిపి రైతులకు రూ.45 వేల కోట్లు చెల్లింపులు చేశామన్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గణాంకాలతో సహా ఆయన వివరించారు. ఈసారి మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం నిర్దేశించుకుందని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.8,749 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
రాష్ట్రంలో 21 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు. హమాలీల కొరతతో కొంత జాప్యం జరిగిందన్నారు. రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి జరిగిందని వివరించారు. కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. మిగిలిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
అలాగే కొనుగోలు కేంద్రాల పనితీరుపై జిల్లా వారీగా సమీక్షించారు. ధాన్యం రవాణా, గోదాముల నిల్వ సామర్థ్యంపై కూడా ఆయన సమీక్షించారు. మహిళా సంక్షేమ కార్యక్రమాల కార్యాచరణపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై సమన్వయంతో కలిసి పని చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వివాహేతర సంబంధానికి భర్త బలి.. ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం!
పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలి: ఎంపీ మల్లు రవి
For More TG News And Telugu News