Share News

బదిలీలకు సై

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:02 AM

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.

బదిలీలకు సై

  • ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేత

  • మే 1 నుంచి 31లోగా ప్రక్రియ పూర్తి కావాలి

  • ఒకే చోట మూడేళ్లు ఉన్న వారు అర్హులు

  • 4ఏళ్ల సర్వీసు ఉన్న వారికి స్థానచలనం తప్పనిసరి

  • ప్రతి క్యాడర్‌లో 40 శాతం మించి బదిలీలు చేపట్టొద్దు

  • ‘జన గణన’ సిబ్బందికి ఈ నిబంధనలు వర్తించవు

  • క్యాడర్ల వారీగా బదిలీల ప్రాధికార కమిటీలు

  • మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. మే 1 నుంచి 31వ తేదీలోగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు (జీవో 38) జారీ చేశారు. బదిలీలు ఫోకల్‌ పాయింట్‌ నుంచి నాన్‌-ఫోకల్‌ పాయింట్‌కు, నాన్‌-ఫోకల్‌ పాయింట్‌ నుంచి ఫోకల్‌ పాయింట్‌కు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఫోకల్‌, నాన్‌-ఫోకల్‌ పాయింట్లను ఆయా శాఖలు గుర్తించి, ప్రదర్శనకు ఉంచాలని తెలిపింది. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, బదిలీ ఉత్తర్వులు అందుకున్న తర్వాత మూడు రోజుల్లోగా కొత్త పోస్టులో జాయిన్‌ కావాలని సూచించింది. జాయిన్‌కాని పక్షంలో సీరియ్‌సగా తీసుకుంటామని హెచ్చరించింది. సెకండ్‌ లెవెల్‌, హైలెవెల్‌ గెజిటెడ్‌ అధికారులకు సొంత జిల్లాల్లో పోస్టింగులిచ్చే సందర్భంలో నిబంధనలు వర్తిస్తాయని, బదిలీలన్నీ ఉద్యోగుల అభ్యర్థన మేరకు జరుగుతున్న బదిలీలు(రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్స్‌)గానే పరిగణిస్తామని, బదిలీ ప్రయాణ భత్యాన్ని(టీటీఏ) చెల్లించబోమని స్పష్టం చేసింది. అయితే, జనగణనలో పాల్గొనే సిబ్బందికి బదిలీల నిబంధనలేవీ వర్తించవని తెలిపింది. జూన్‌ 1 నుంచి మళ్లీ సాధారణ బదిలీలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి, మల్టీ జోనల్‌/జోనల్‌ స్థాయి, జిల్లా స్థాయి పోస్టుల బదిలీల కోసం ప్రభుత్వం మూడు వేర్వేరు ప్రాధికార కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర పోస్టుల ప్రాధికార కమిటీలో సంబంధిత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి, విభాగాధిపతి, ముఖ్యకార్యదర్శి నియమించే అదనపు/సంయుక్త/ఉపకార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మల్టీజోనల్‌/జోనల్‌ పోస్టులకు సంబంధించి విభాగాధిపతి, ముఖ్యకార్యదర్శి నియమించే అదనపు/సంయుక్త/ ఉపకార్యదర్శి, రీజినల్‌ ఆఫీసర్‌/అదనపు/సంయుక్త సంచాలకులు సభ్యులుగా ఉంటారు. జిల్లా పోస్టుల ప్రాధికార కమిటీలో జిల్లా కలెక్టర్‌, అదనపుకలెక్టర్‌/జిల్లా రెవెన్యూ అధికారి, సంబంధిత శాఖ జిల్లా అధికారి సభ్యులుగా ఉంటారు.


  • 2026 జనవరి 1 నాటికి ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగీ బదిలీకి అర్హులే. భార్యాభర్తల (స్పౌజ్‌) కేసు కింద బదిలీలు కోరుకునే వారికి మూడేళ్ల నిబంధన వర్తించదు.

  • 2025 డిసెంబరు 31 నాటికి ఒకే చోట నాలుగేళ్లకు మించి సర్వీసు కలిగి ఉన్న ఉద్యోగిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. 2027 మే 31 లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు. వారు బదిలీ కోరితేనే పరిగణనలోకి తీసుకోవాలి.

  • ప్రభుత్వ పనులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి.. ప్రతి క్యాడర్‌లో 40 శాతానికి మించి బదిలీలు చేపట్టరాదు.

  • ఒకే ప్రదేశాన్ని(ప్లేస్‌) ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు కోరుకున్నట్లయితే... స్పౌజ్‌ కేసులు, 2027 మే 31లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులు, 70ు కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న వారు, మానసిక వైకల్యం ఉండే పిల్లలున్న ఉద్యోగులకు ప్రాధాన్య క్రమంలో అవకాశమివ్వాలి.

ఇలా బదిలీల ప్రక్రియ

  • ఆయా విభాగాధిపతులు.. ఉద్యోగుల వివరాలను క్యాటగిరీ, క్యాడర్ల వారీగా జాబితాలను నోటీసుబోర్డులపై బహిర్గతపర్చాలి. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించే ముందు ఎక్కడెక్కడ వేకెన్సీలున్నాయో వెల్లడించాలి. తప్పనిసరిగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల పేర్లనూ వెల్లడించాలి.

  • ఉద్యోగులు తాము బదిలీ కోరకునే ఐదు ప్రాంతాలను ప్రాధాన్య క్రమంలో నిర్దేశిత ప్రొఫార్మాలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.

  • సమస్యాత్మక ప్రాంతాలతోపాటు ఇతరప్రాంతాల్లో కనీస సంఖ్యలో సిబ్బంది ఉండేలా అధికారులు చూసుకోవాలి.

  • సమస్యాత్మక ప్రాంతాల్లోని ఖాళీలకు సరిపడా సిబ్బంది ఆప్షన్లు ఇవ్వకపోతే... లాటరీ పద్ధతిని అనుసరించాలి.

  • బదిలీలన్నీ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పారదర్శకంగా చేపట్టాలి. ప్రతి నోటిఫికేషన్‌ను ఆన్‌లైన్‌లో, నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీ శాఖలు ఈ ప్రక్రియను అనుసరిస్తూనే.. ప్రత్యేక మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి.


బదిలీల జీవోపై ఉద్యోగుల జేఏసీ హర్షం

బదిలీల జీవో విడుదలపై ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని సమయోచిత చర్యలు తీసుకున్నందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు. కాగా, బదిలీల జీవోలో పేర్కొన్న మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాల నేత లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. బదిలీలకు రెండు నెలల పాటు అవకాశం ఇవ్వాలని కోరారు. ఒక క్యాడర్‌లో గరిష్ఠంగా 40శాతం మందికే బదిలీలు చేపట్టాలని పేర్కొనడం సరికాదని, శాతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా అర్హత కలిగిన ఉద్యోగులందరినీ బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

బదిలీల షెడ్యూల్‌

  • బదిలీలకు అర్హులైన ఉద్యోగుల జాబితాలు, క్లియర్‌ వెకెన్సీల వివరాల వెల్లడి: మే 1 నుంచి మే 7 వరకు

  • ఉద్యోగులు తమ ఆప్షన్లు ఇవ్వడం: మే 8 నుంచి మే 15 వరకు

  • దరఖాస్తుల పరిశీలన, కౌన్సెలింగ్‌ కోసం మాస్టర్‌ జాబితా రూపొందించడం: మే 16 నుంచి మే 24 వరకు

  • బదిలీల ఉత్తర్వుల జారీ: మే 25 నుంచి మే 31 వరకు

Updated Date - Apr 22 , 2026 | 04:02 AM