రాహుల్ ప్రధాని కావాలని గణేశున్ని కోరుకున్నా: వి. హనుమంతరావు
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:59 PM
రాహుల్ గాంధీ ప్రధాని కావాలని గణనాథున్ని కోరుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాహుల్ గాంధీ ప్రధాని కావాలని గణనాథున్ని కోరుకున్నట్లు ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలని, వారిని నిరుద్యోగపు విషవలయం నుంచి బయటపడేయాలని వినాయకుడిని ప్రార్థించినట్లు హనుమంతరావు తెలిపారు.
అనంతరం కులగణన, రిజర్వేషన్లపై హనుమంతరావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జనగణనలో బీసీల ఊసే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు కూడా అన్యాయం జరుగుతోందని, బీసీల గణనను చేపట్టాలని రాహూల్ డిమాండ్ చేసినా.. ప్రధాని మోదీ పెడచెవిన పెడుతున్నారన్నారు. బీసీల గణన చేపడితే రాహూల్ గాంధీకి ప్రయోజనం చేకూరుతుందని మోదీ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు.
దేశంలోనే ప్రథమంగా కులగణన చేపట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రలో స్థానం సంపాదించారని హనుమంతరావు అన్నారు. అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపడతామని క్యాబినెట్‌లో రేవంత్ తీర్మానం చేశారని.. అన్నట్లుగానే బీసీల సంఖ్యను గణించి.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆయన కొనియాడారు.
అన్ని జిల్లాలు తిరిగి అవగాహన కల్పిస్తాం: ఏఐసీసీ ఓబీసి చైర్మన్ ముఖుల్ యాదవ్
సెన్సెస్‌లో బీసీల పేరు లేకపోవడం అన్యాయమని ఏఐసీసీ ఓబీసీ చైర్మన్ ముఖుల్ యాదవ్ అన్నారు. జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చే వరకూ పోరాటం చేస్తామన్నారు. వంద రోజుల పాటు ప్రతి జిల్లా తిరుగుతూ.. ఓబీసీలకు జరుగుతున్న అన్యాయంపై అవగాహన కల్పిస్తామని ముఖుల్ పేర్కొన్నారు. కాగా.. 1948లో జాతీయ జెండా ఎగరవేసిశారని వల్లాలలో 10 మంది యువకులను నిజాం పోలీసులు కాల్చి చంపారని ఆయన చెప్పారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వల్లాల గ్రామంలో అమరవీరుల విగ్రహాలు ప్రారంభిస్తామని ముఖుల్ యాదవ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్
ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే దారుణం