Share News

మహిళా స్వయం సహాయక బృందాలకు గుడ్ న్యూస్ చెప్పిన సీతక్క

ABN , Publish Date - May 07 , 2026 | 05:51 PM

మహిళా స్వయం సహాయక బృందాలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి ఒక గ్రూపునకు వడ్డీ లేని రుణాలు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు.

మహిళా స్వయం సహాయక బృందాలకు గుడ్ న్యూస్ చెప్పిన సీతక్క
TG Minister Seethakka

హైదరాబాద్, మే07: మహిళా స్వయం సహాయక బృందాలకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. ప్రతి ఒక గ్రూపునకు వడ్డీ లేని రుణాలు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రతి మహిళా సంఘం తీసుకునే రూ. 10 లక్షలు బ్యాంకు రుణాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తోందని హామీ ఇచ్చారు. మహిళా సంఘాల రుణాలకు ఈ ఏడాది వడ్డీల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. మహిళా ఉన్నతి.. తెలంగాణ ప్రగతి అన్న నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.


మహిళల ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంలా తామంతా పని చేస్తున్నామని వివరించారు. మహిళలు పేదరికం నుంచి బయటపడినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అందుకే వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆర్థికంగా మహిళలను ఎదిగేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో తాము పనిచేస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. 40 శాతం పంట కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించామని గుర్తు చేశారు.


ఈ ఏడాది రూ. 26 వేల కోట్లకు పైగా మహిళలకు బ్యాంకు రుణాలుగా అందిస్తున్నట్లు మంత్రి సీతక్క వివరించారు. మహిళల ఆర్థిక సాధికారతలో ఇది ఒక మైలురాయి అని అభివర్ణించారు. ఇది లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో మహిళలకు పట్టుమని రూ. పది వేల లోన్ ద్వారా లభించేవి కాదన్నారు. ఇప్పుడు అదే మహిళలకి బ్యాంకులు లక్షలాది రూపాయలు లోన్ రూపంలో అందిస్తున్నాయని వివరించారు.


పేదరికం వల్లే తాను నక్సలైట్లలో చేరానని ఈ సందర్భంగా సీతక్క గుర్తు చేసుకున్నారు. వడ్డీ వ్యాపారుల దోపిడి కారణంగా సామాన్యులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధ చూడ లేక తాను తుపాకీ పట్టానని వివరించారు. ఆ అనుభవంతోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు కల్పించాలనే సంకల్పంతో తాము పని చేస్తున్నామని మహిళా స్వయం సహాయక బృందాలకు మంత్రి సీతక్క తెలిపారు.


ఇప్పటి వరకు అర్హత గల మహిళా సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు కల్పించామన్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నామని వివరించారు. మహిళలపై భారాన్ని దించేందుకు వడ్డీ లేకుండా రెట్టింపు లోన్లు ఇస్తున్నామన్నారు. బ్యాంకులకు రీ పేమెంట్ బాగా చేస్తున్నారంటూ మహిళా సంఘాలపై ఈ సందర్బంగా మంత్రి సీతక్క ప్రశంసలు కురిపించారు.


నిర్మల్ జిల్లా జీరో ఎన్‌పీఏ (NPA) సాధించిందని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ విజయలక్ష్మిని మంత్రి సీతక్క అభినందించారు. నిర్మల్ జిల్లా తరహాలోనే అన్ని జిల్లాలు వంద శాతం బ్యాంకులకు రీపేమెంట్ చేయాలని సూచించారు. బ్యాంకర్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టాలని మహిళా సంఘాలకు మంత్రి స్పష్టం చేశారు.

మహిళా సంఘాలకు సరళమైన పద్ధతిలో లోన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా బ్యాంకర్లకు మంత్రి సూచించారు. బ్యాంకులకు తాము గ్యారెంటీ ఇస్తున్నామని చెప్పారు. పూర్తిస్థాయిలో రీపేమెంట్ చేసే బాధ్యత తమదన్నారు. వ్యక్తులకు లోన్ ఇస్తే ఎగ్గొట్టే ప్రమాదం ఉంటుందని.. అదే మహిళా శక్తికి సహకరిస్తే మీ నగదుకు భద్రత లభిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్న తమిళనాడు గవర్నర్: టీపీసీసీ చీఫ్

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2026 | 06:21 PM