తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష..
ABN , Publish Date - Sep 11 , 2026 | 09:44 PM
తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు ఏర్పాట్లు వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ సమ్మిట్ ఏర్పాట్లపై సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డిసెంబరు 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ సమ్మిట్ ఏర్పాట్లపై సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ప్రతినిధులకు ఆహ్వానాలను ముందస్తుగానే పంపడంతో పాటు వారి ప్రయాణం, వసతి, రవాణా, భద్రత తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సంజయ్ జాజు ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డు, సెక్టోరల్ ఎగ్జిక్యూటివ్ బోర్డుల కార్యాచరణపైనా సమావేశంలో చర్చించారు. సమ్మిట్ విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్నారు. వేదిక, మీడియా, హాస్పిటాలిటీ తదితర కమిటీల ఏర్పాట్లను కూడా సమీక్షించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులకు అనుగుణంగా సమ్మిట్ వేదికను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. ప్రతినిధుల రిసెప్షన్, వసతి, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
గ్లోబల్ సమ్మిట్‌కు ముందుగా ఈ నెలాఖరులో దేశ రాజధాని ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని సీఎస్ నిర్వహించనున్నారు. తెలంగాణలోని పెట్టుబడి అవకాశాలు, రాష్ట్రం సాధిస్తున్న ఆర్థిక ప్రగతి, భవిష్యత్ వృద్ధి అవకాశాలను జాతీయ, అంతర్జాతీయ వర్గాలకు పరిచయం చేసేలా కార్యక్రమాన్ని రూపొందించాలని సీఎస్ సూచించారు. మరోవైపు, సమ్మిట్ కోసం సమగ్ర మీడియా, ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేసేలా జాతీయ, అంతర్జాతీయ మీడియాను భాగస్వామ్యం చేయాలన్నారు. సమ్మిట్‌కు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని సంజయ్ జాజు స్పష్టం చేశారు.
సమ్మిట్ ఏర్పాట్లన్నీ నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా టైమ్‌బౌండ్ కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ఇన్నోవేషన్, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలు, ఆర్థిక వృద్ధికి గ్లోబల్ సమ్మిట్ కీలక వేదికగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని తెలంగాణ వైపు మళ్లించి, రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా ప్రదర్శించేందుకు సమ్మిట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
జీవో నంబర్ 97పై అసెంబ్లీ వేదికగా మంత్రి వివేక్ కీలక ప్రకటన..
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కమిటీతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ భేటీ..