Share News

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కమిటీతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ భేటీ..

ABN , Publish Date - Sep 11 , 2026 | 09:00 PM

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల సందడి మొదలైంది. సెప్టెంబరు 14న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు యువత సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కమిటీతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశమయ్యారు.

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కమిటీతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ భేటీ..
Hyderabad Ganesh Utsav 2026

హైదరాబాద్: నగరంలో గణేశ్ ఉత్సవాల సందడి మొదలైంది. సెప్టెంబరు 14న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు యువత సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పండగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఈరోజు (శుక్రవారం) భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కమిటీతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గణేశ్ ఉత్సవాలపై కమిటీ సభ్యులకు ఆయన కీలక సూచనలు చేశారు.


ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కమిటీని కోరారు. విగ్రహాల ఆగమన సమాచారాన్ని ముందుగానే పోలీసులకు అందించాలని సూచించారు. ఉత్సవాల సమయంలో వాహనాలపై డ్యాన్స్ చేస్తూ విగ్రహాలను తరలించొద్దని స్పష్టం చేశారు. వినాయక మండపాల వద్ద నలుగురు లేదా ఐదుగురు వాలంటీర్లను పెట్టాలని సూచించారు. అలాగే వారి వివరాలను పోలీస్ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గణేశ్ ఉత్సవాల్లో శబ్ద కాలుష్యాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.


నిమజ్జనం రోజున ఉదయాన్నే ఊరేగింపులు ప్రారంభించాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఉత్సవ కమిటీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. మరోవైపు, ఖైరతాబాద్, బాలాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలు, రోడ్ల సమస్యలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. నిమజ్జనం విజయవంతం చేసేందుకు ఉత్సవ కమిటీలు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ సజ్జనార్ మరోసారి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

జీవో నంబర్‌ 97పై అసెంబ్లీ వేదికగా మంత్రి వివేక్‌ కీలక ప్రకటన..

Updated Date - Sep 11 , 2026 | 09:00 PM