జీవో నంబర్ 97పై అసెంబ్లీ వేదికగా మంత్రి వివేక్ కీలక ప్రకటన..
ABN , Publish Date - Sep 11 , 2026 | 08:18 PM
పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు జీవో నంబర్ 97పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించడంతో పాటు వారి భవిష్యత్తుకు పూర్తి రక్షణ కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు.
హైదరాబాద్: పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకులు జీవో నంబర్ 97పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించడంతో పాటు వారి భవిష్యత్తుకు పూర్తి రక్షణ కల్పిస్తామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జీవో 97లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు కె.కేశవరావు కమిటీ సభ్యులతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు మేలు జరిగేలా జీవోలో మార్పులు తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈసెట్ పరీక్ష ఉంటుందని, దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి వివేక్ తెలిపారు. ఫీజులు పెరుగుతాయంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు ప్రైవేటు ఉద్యోగులుగా మారుతారనే ఆందోళనా అవసరం లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల హోదా కొనసాగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలల భూములను ప్రభుత్వం విక్రయిస్తుందంటూ బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారాన్నీ ఆయన ఖండించారు. పాలిటెక్నిక్ కళాశాలలను మోడల్ సంస్థలుగా తీర్చిదిద్దుతున్నామని, వాటిని స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేశామని మంత్రి చెప్పారు.
విద్యార్థుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నమ్మకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గమనించాలని మంత్రి వివేక్ సూచించారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టామ్‌కామ్ ద్వారా చర్యలు చేపడుతున్నామనీ తెలిపారు. పాస్‌పోర్టులు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గతంలో కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు యువతను మోసం చేశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టామ్‌కామ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. జర్మన్, జపాన్ భాషల్లో శిక్షణ అందించడం ద్వారా సుమారు 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. జపాన్‌లో పర్యటించి అక్కడి సంస్థలతో యువతకు ఉద్యోగ అవకాశాలపై చర్చించామని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థులకు జపాన్‌లో డిమాండ్ ఉందని, తమకు పాలిటెక్నిక్ విద్యార్థులు అవసరమని అక్కడి ప్రతినిధులు చెప్పారని మంత్రి వివేక్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఇతర రాష్ట్రాల మంత్రులు అభినందించారని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఒక్క క్లస్టర్ చొప్పున కేటాయించగా.. తెలంగాణకు నాలుగు క్లస్టర్లు మంజూరు చేసిందని వెల్లడించారు.
మల్లెపల్లిలోని ఐటీఐను అత్యుత్తమంగా తీర్చిదిద్దామని మంత్రి వివేక్ తెలిపారు. ప్రతిపక్ష, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వీలైనప్పుడు అక్కడికి తీసుకెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూపిస్తానని చెప్పారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఖైరతాబాద్‌లో నేత్రపర్వంగా మహాగణపతి ఆగమన్
తెలంగాణలో అనలాగ్ పనీర్‌పై నిషేధం..