విద్యతోనే సామాజిక మార్పు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Sep 11 , 2026 | 09:34 PM
విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
హైదరాబాద్: విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యను విస్తరించేందుకు అనేక చర్యలు తీసుకున్నాయని తెలిపారు. ప్రతి గూడెంలో సింగిల్ టీచర్ పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. ప్రతి హ్యాంలెట్, గ్రామ పంచాయతీలో ప్రాథమిక విద్య అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి 3 కిలోమీటర్లకు ఓ ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు మాధ్యమిక ఉన్నత పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్లకు హైస్కూల్ ఏర్పాటు చేశామని వివరించారు.
అలాగే ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇంజినీరింగ్ కాలేజీ, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు గిరిజన ప్రాంతాల్లో విద్యను విస్తరించామని, ఆదివాసీ గూడెల్లోనూ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. 2004 తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు యూనివర్సిటీలను నిర్మించామని సీఎం పేర్కొన్నారు. సామాజికంగా వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం చదువు లేకపోవడమేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యా విధానంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్య, ఉద్యోగం, ఉపాధికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో కూడిన విద్యను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ విద్యా విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు తొలిసారిగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. విద్యతోనే సామాజికంగా వెనుకబడిన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక మార్పునకు విద్యే ప్రధాన సాధనమని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పేదలకు మేలు చేసే నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకే కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. సీఎం సమీక్ష నిర్వహిస్తే ఉన్నతాధికారులంతా హాజరవుతారని, వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. న్యాయశాఖ, విద్యాశాఖ వంటి ముఖ్యమైన శాఖలను స్వయంగా సమీక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read:
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కమిటీతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ భేటీ..
జీవో నంబర్ 97పై అసెంబ్లీ వేదికగా మంత్రి వివేక్ కీలక ప్రకటన..