‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:44 AM
రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ-2026 సదస్సు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
గత సదస్సు ఎంఓయూల ప్రగతిని సమీక్షించండి..
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ-2026 సదస్సు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డిసెంబరు 7-9 తేదీల్లో జరిగే సదస్సు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, గత సదస్సులో చేసుకున్న ఎంఓయూల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి అధ్యక్షతన ఇన్వెస్ట్ తెలంగాణ-2026 సన్నాహక సమావేశం సచివాలయంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తును, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే ఈ చరిత్రాత్మక ఘట్టంలో అధికారులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో ప్రపంచ సదస్సు ఇదని, ఈ సదస్సు ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేయాలని పిలుపునిచ్చారు.
సదస్సు నిర్వహణ, పర్యవేక్షణకు 10 అధికారుల కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి కమిటీకి ఒక సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. వివిధ రకాల పనులు, బడ్జెట్ అంచనాలు, ఆమోదాల విషయంలో ఎలాంటి ఆలస్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అధికారుల కమిటీలతో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసి వాటికి సంబంధిత మంత్రులను చైర్‌పర్సన్లుగా నియమించామని వివరించారు. గత సదస్సులో కుదిరిన ఎంఓయూలను కూడా సమీక్షించి, వాటి పురోగతిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న దేశాలు, నగరాలు, రంగాలను గుర్తించి దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి మంత్రిమండలి ఉపసంఘానికి నివేదించాలని ఆదేశించారు. ప్రతినిధుల స్పందనను అనుసరించి అవసరమైతే ప్రస్తుతం అనుకుంటున్న 4 సభా ప్రాంగణాల(హాల్స్)ను 6 లేదా 8కి పెంచేందుకు సిద్ధంగా ఉండాలని భట్టి సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌదీ తెలుగు ప్రవాసీయులు.. గల్ఫ్ భారతీయులందరికీ ఆదర్శం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News