Share News

ఆహార భద్రతా విభాగం ఉండదిక!

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:35 AM

రాజధానిలోని మూడు కార్పొరేషన్లలో ఆహార భద్రతా విభాగం కనుమరుగు కానుంది. ఫుడ్‌ సేఫ్టీ, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ)లను కలిపి కొత్త శాఖ ఏర్పాటు చేసేందుకు కసరత్తు తుది దశకు చేరుకుంది.

ఆహార భద్రతా విభాగం ఉండదిక!

  • హైదరాబాద్‌లోని మూడు కార్పొరేషన్లలో కనుమరుగు

  • ‘ఫుడ్‌ సేఫ్టీ, ఔషధ నియంత్రణ’ కలిపి ఎఫ్‌ఎస్‌డీఏ ఏర్పాటు

  • తొలుత 3 కమిషనరేట్లలో అమలు.. తర్వాత రాష్ట్రమంతటా..

  • ముఖ్యమంత్రి రేవంత్‌ ఆమోదించగానే ఉత్తర్వులు?

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): రాజధానిలోని మూడు కార్పొరేషన్లలో ఆహార భద్రతా విభాగం కనుమరుగు కానుంది. ఫుడ్‌ సేఫ్టీ, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ)లను కలిపి కొత్త శాఖ ఏర్పాటు చేసేందుకు కసరత్తు తుది దశకు చేరుకుంది. సీఎం రేవంత్‌ ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. సీఎస్‌ సంజయ్‌జాజు, ప్రత్యేక సీఎస్‌ జయేశ్‌రంజన్‌, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రామకృష్ణారావు సంబంధిత అధికారులతో ఈ విషయంపై చర్చించారు. ఫుడ్‌ సేఫ్టీ, డీసీఏ అధికారుల బృందాలు ముంబై, బెంగళూరుల్లో అధ్యయనం చేశాయి. అక్కడ ఫుడ్‌ సేఫ్టీ, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఒకే గొడుకు కింద ఉన్నాయి. తద్వారా ఆహార, ఔషధాల కల్తీ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించవచ్చని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఫుడ్‌ సేఫ్టీ, డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఎస్‌డీఏ) విభాగం ఏర్పాటు, తెలంగాణ ఫుడ్‌ అడల్ట్రేషన్‌ అండ్‌ డ్రగ్‌ కంట్రోల్‌ యాక్ట్‌(టీజీఎఫ్‌ఏడీసీ)ను రూపొందించడంపై అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్‌ ఫుడ్‌ అడలే్ట్రషన్‌ సర్వైలెన్స్‌ టీమ్‌(హెచ్‌-ఫా్‌స్ట) ఏర్పాటు చేసిన 4 నెలల్లో 195 కేసులు, 132.30 టన్నుల కల్తీ, నాసిరకం ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. 70 మందిని అరెస్టు చేశారు. అలాగే నకిలీ ఔషధాల విక్రయం కూడా పెరుగుతున్నట్లు డీసీఏ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నూతన చట్టం, ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం ఆమోదం తెలిపితే.. అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఎఫ్‌ఎ్‌సడీఏను తొలుత తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌)లో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అనంతరం రాష్ట్రమంతటా అమలు చేయాలని యోచిస్తున్నారు.


ఇవీ చదవండి:

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

తలసేమియా బాధితులకు పింఛన్లు

Updated Date - Jul 31 , 2026 | 08:04 AM