అలర్ట్.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం..
ABN , Publish Date - Apr 11 , 2026 | 07:35 PM
తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన ఎల్-నినో ప్రభావం, పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) పరిస్థితుల కారణంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన ఎల్-నినో ప్రభావం, పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) పరిస్థితుల కారణంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేసింది. 2026 వర్షపాతానికి సంబంధించిన అంచనాలు తెలంగాణలో కొంత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. కొన్నేళ్లుగా తెలంగాణలో మంచి వర్షాలు పడ్డాయని.. ముఖ్యంగా 2025లో అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. రైతులు సాగు చేసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది.
అయితే, 2026లో పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించింది. 2018 సంవత్సరం తరహాలో ఈసారి వర్షపాతం ఉండొచ్చని అంచనా వేసింది. జూన్- సెప్టెంబర్ కాలంలో అన్ని నెలలూ ‘సగటు కంటే తక్కువ’ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. కానీ, 2014-15 సంవత్సరాల మాదిరిగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. మహబూబ్‌నగర్, నారాయణపేట్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల్ వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఈ మేరకు నీటి వనరులను అన్నదాతలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. వరి వంటి ఎక్కువ నీరు అవసరమైన పంటలకు బదులుగా పప్పు, జొన్న వంటి తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలని చెబుతున్నారు. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాభావాన్ని దృష్టిలో ఉంచుకుని సాగు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షాలు పడే సూచనలు ఉన్నందున ప్రభుత్వం, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గజ్వేల్ రింగ్ రోడ్డు పనులపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: రఘునందన్ రావు
తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్‌లో కలకలం.. డిప్యూటీ కమిషనర్ రాజీనామా..