Share News

మంగ్లీపై కేసు.. అడ్వకేట్ సుబ్బారావు సంచలన విషయాలు వెల్లడి

ABN , Publish Date - Apr 11 , 2026 | 02:47 PM

తెలుగు రాష్ట్రాల్లో సింగర్ మంగ్లీపై కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మందిని మోసం చేయడం, బాధితుల తరఫు న్యాయవాదిపై బెదిరింపులకు పాల్పడడంపై కేసు నమోదు అయ్యింది.

మంగ్లీపై కేసు.. అడ్వకేట్ సుబ్బారావు సంచలన విషయాలు వెల్లడి
Singer Mangli Case

హైదరాబాద్: సింగర్ మంగ్లీపై కేసు నమోదు కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. పెట్టుబడుల పేరుతో సుమారు 100 మందిని మోసం చేయడం, బాధితుల తరఫు న్యాయవాదిపై బెదిరింపులకు పాల్పడడంపై కేసు నమోదు అయ్యింది. బాధితుల నుంచి సుమారు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మేర వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొంతమందిపై కేసు నమోదు అయ్యింది. ఈ సందర్భంగా బాధితుల తరఫు న్యాయవాదితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ కేసుకు సంబంధించి ఆయన సంచలన విషయాలను వెల్లడించారు.


ఈ సందర్భంగా అడ్వకేట్ సుబ్బారావు మాట్లాడుతూ.. 'రెండు నెలల కిందట సింగర్ మంగ్లీ పేరుతో తమను మోసం చేశారని కొంతమంది బాధితులు మమ్మల్ని కలిశారు. మేము విచారణ చేపట్టగా ఈ మోసంలో మంగ్లీతోపాటు ఆమె సోదరుడు శివ, మధు అనే వ్యక్తి ఉన్నట్టు తేలింది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం సింగర్ మంగ్లీని కలిశాను. ఆమె చాలా అహంకారంతో మాట్లాడారు. ప్రధాన నిందితుడు మధు ముందు వరుసలో ఉండి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు వరకూ పెట్టుబడుల రూపంలో సేకరించారు. రియల్ ఎస్టేట్‌తోపాటు ఇతర రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఇస్తామని బాధితుల నుంచి నగదు వసూలు చేశారు. లాభాలతోపాటు పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వకపోవడంతో వారంతా మమ్మల్ని ఆశ్రయించారు.


ఓ కేంద్రమంత్రి పేరు చెప్పి మంగ్లీ, శివ, మధు నన్ను బెదిరించారు. ఇప్పటికే బెదిరింపులపై కేసు నమోదు అయ్యింది. సివిల్ సూట్ కూడా ఫైల్ చేయబోతున్నా. నేను కేసును తీసుకున్న తర్వాత మంగ్లీ అడ్వకేట్ పూజ నాగేశ్వరరావుతోపాటు డైరెక్టర్ వేణు ఉడుగుల నన్ను కలిశారు. మాట్లాడదామని వాళ్లు చెబితే బాధితులను తీసుకుని పంజాగుట్టలోని నాగేశ్వరరావు కార్యాలయానికి వెళ్లాను. నాలుగు గంటలపాటు పంజాగుట్టలో ఈ విషయంపై చర్చలు జరిగాయి. మరోవైపు మంగ్లీ కాల్ చేసి ఇంటర్వ్యూలు డిలీట్ చేయమని, క్షమాపణ చెప్పాలని అడిగారు. తనకు ఈ మోసంతో ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ చెప్పారు. ఎలాంటి సంబంధం లేకపోతే మాకు సపోర్ట్ చేయమని ఆమెను అడిగాం. మధుతో సంబంధం లేనప్పుడు మీరు కూడా కేసు పెట్టాలని కోరాం. మంగ్లీ కేసు పెట్టనని చెప్పారు.


ఎందుకంటే మధుతో సింగర్ మంగ్లీ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మంగ్లీ చెల్లెలను మధుకు ఇవ్వడానికి నిశ్చితార్థం కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసిన విషయంలో మధుతోపాటు మంగ్లీ సోదరుడు శివ ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని మంగ్లీ, మిగిలినవారు డబ్బులు ఆఫర్ చేశారు. నాకు డబ్బులు వద్దు బాధితులకు ఇవ్వమని చెప్పాను. డబ్బులు ఆఫర్ చేసినా కేసు వెనక్కి తీసుకోకపోవడంతో నన్ను బెదిరించారు. హిట్ అండ్ రన్ చేసి చంపుతామని హెచ్చరించారు. ఓ ఎమ్మెల్యే తండ్రితో, కమ్యూనిటీ పెద్దలతో కాల్ చేయించారు. 22 రోజుల కిందట ఫిర్యాదు చేస్తే తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. వట్టిపల్లి తండాలో సుమారుగా 200 మంది దాకా బాధితులు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.200 కోట్లు వసూలు చేశారు.


రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ వారి బాధితులు ఉన్నారు. మంగ్లీ పేరు చెబితేనే తామంతా మధుకి డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. కోకాపేట్‌లో పబ్బు, హాస్పిటల్, స్కూల్, సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నామని చెప్పి అమాయకుల నుంచి కోట్లు వసూలు చేశారు. గోకులనందన ఇన్ఫ్రా అనే సంస్థలో పెట్టుబడులు తీసుకున్నారు. అధిక లాభాలు ఇస్తారని నమ్మి చిన్న, మధ్య తరగతి వాళ్లంతా పెట్టుబడి పెట్టి మోసపోయారు' అని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే శాంతి భద్రతలు: ప్రధాని నరేంద్ర మోదీ

హైదరాబాద్‌లో మరో కొత్త సైబర్ మోసం.. ప్రజలకు హెచ్చరిక

Updated Date - Apr 11 , 2026 | 03:28 PM