Share News

వస్తు ఎగుమతుల్లో దూకుడు

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:28 AM

తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తు ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడిన తర్వాత.. 2023--26 మధ్య కాలంలో సగటు వార్షిక ఎగుమతులు 68.3 శాతం వృద్థితో రూ.1.33 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి.

వస్తు ఎగుమతుల్లో దూకుడు
Telangana Exports

  • తెలంగాణలో గత మూడేళ్లలో 68.3 శాతం పెరుగుదల

  • రూ.1.33 లక్షల కోట్లకు సగటు వార్షిక ఎగుమతులు

  • ఇంజనీరింగ్‌, ఫార్మా రంగాల్లో మెరుగైన పనితీరు

  • ఏరోస్పేస్‌, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా రాష్ట్రం

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తు ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడిన తర్వాత.. 2023--26 మధ్య కాలంలో సగటు వార్షిక ఎగుమతులు 68.3 శాతం వృద్థితో రూ.1.33 లక్షల కోట్లకు దూసుకెళ్లాయి. అంతకుముందు మూడేళ్ల కాలంలో (2020-23) వార్షిక ఎగుమతులు రూ.79వేల కోట్లుగానే ఉన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ (డీజీసీఐఎస్‌) గణాంకాల ఆధారంగా.. రాష్ట్ర సర్కారు ఈ వివరాలను విడుదల చేసింది.


వీటి ప్రకారం.. ఇంజనీరింగ్‌, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం మెరుగైన ప్రగతి సాధిస్తోంది. ఏరోస్పేస్‌, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ముఖ్య కేంద్రంగా ఎదుగుతోంది. తెలంగాణ నుంచి వస్తు ఎగుమతులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.64,539 కోట్లుగా ఉండగా.. 2025-26 నాటికి రూ.1,22,655 కోట్లకు చేరాయి. ఈ ఆరేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా 2024--25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.1,61,843 కోట్ల ఎగుమతులు జరిగాయి. 2025-26లో విద్యుత్‌ యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ అప్లయన్సెస్‌ ఉమ్మడి ఎగుమతులు రూ.17,765 కోట్లకు చేరాయి. 2024-25లో నమోదైన రూ.14,632 కోట్లతో పోలిస్తే 21.41 శాతం పెరిగాయి. రాష్ట్ర మొత్తం వస్తు ఎగుమతుల్లో ఈ రెండు విభాగాల వాటా 2024-25లో 9.04 శాతంగా ఉండగా, 2025-26లో 14.48 శాతానికి పెరిగింది.


ఫార్మా ఎగుమతులకు ముఖ్య కేంద్రంగా ఉన్న తెలంగాణ.. ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లోనూ పురోగతి సాధిస్తోంది. ఇంజనీరింగ్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) తాజా గణాంకాల ప్రకారం.. 2026 అక్టోబరులో గత ఏడాది అదే నెలతో పోలిస్తే ఎగుమతులు 69 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026--27) ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 31 శాతం వృద్థి నమోదైంది. ఈ కాలంలో ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజన్‌ విడిభాగాలు 244 శాతం, రాగి ఉత్పత్తులు 106 శాతం, సీసం ఉత్పత్తుల ఎగుమతులు 196 శాతం మేర వృద్ధి చెందాయి. జిల్లాల వారీగా చూస్తే 2025--26లో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా రూ.29,131 కోట్ల వస్తు ఎగుమతులతో అగ్రస్థానంలో నిలిచింది.


రాష్ట్ర మొత్తం ఎగుమతుల్లో ఈ జిల్లా వాటా 23.75 శాతంగా ఉంది. హైదరాబాద్‌ రూ.26,437.55 కోట్లతో (21.55 శాతం), సంగారెడ్డి రూ.24,970.43 కోట్లతో (20.36 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో 2024-25లో రూ.6,818.20 కోట్లుగా ఉన్న ఎగుమతులు 2025-26లో రూ.10,648.13 కోట్లకు చేరాయి. ఇది 56.17 శాతం వృద్థి. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ రూ.3,117.97 కోట్ల నుంచి రూ.4,119.68 కోట్లకు పెరిగాయి. ఇక్కడ 32.13 శాతం వృద్థి నమోదైంది. లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, ఎయిర్‌బస్‌, సఫ్రాన్‌, హనీవెల్‌, జీఈ ఏవియేషన్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ, కాలిన్స్‌ ఏరోస్పేస్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో తయారీ, ఇంజనీరింగ్‌, నిర్వహణ, శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా రాబోయే ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌--2026’లో పరిశ్రమలు, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌, ఎలక్ర్టానిక్స్‌, సెమీకండక్టర్లకు సంబంధించిన నూతన విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 04:28 AM