Share News

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రూ.30 వేల కోట్లు అవసరం.. రేవంత్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 04:15 PM

ఎల్‌నినో వల్ల వర్షాలు పడటం లేదని, అందుకే తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు మరోసారి సూచించారు. ఈరోజు (ఆదివారం) పీఏసీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రూ.30 వేల కోట్లు అవసరం.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy

ఇంటర్నెట్ డెస్క్: ఎల్‌నినో వల్ల వర్షాలు పడటం లేదని, అందుకే తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు మరోసారి సూచించారు. ఈరోజు (ఆదివారం) పీఏసీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను వివరించారు. ‘ఎల్‌నినో దృష్ట్యా ఎన్నో చర్యలు తీసుకున్నాం. పంటలు ఎండి పోకుండా కాపాడాం. దాదాపు 100 దేశాలు ఎల్‌నినో ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నాయి. పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరవు పరిస్థితులు ఉన్నాయి. వచ్చే 8 నెలలు తాగునీటికి కొరత ఏర్పడవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జలాలను తాగునీటి కోసం వినియోగించాలని నిర్ణయించాం. ఈ ఎల్‌నినోను ఎదుర్కోవడానికి రూ.30 వేల కోట్లు అవసరం. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


నెహ్రూ చొరవ వల్ల అందరికీ విద్య

భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూను సమావేశంలో రేవంత్ కొనియాడారు. ‘తొలి ప్రధాని నెహ్రూ చొరవ వల్ల దేశంలో విద్య ప్రతి ఒక్కరికీ అందుతోంది. నెహ్రూ ప్రణాళికలతో ఇరిగేషన్ రంగమూ బాగా అభివృద్ధి చెందింది’ అంటూ ముఖ్యమంత్రి ప్రశంసించారు. అనంతరం మీనాక్షీ నటరాజన్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ సాధించిన విజయాలను ఆయన వివరించారు. 100 ఏళ్ల తర్వాత మొదటి సారి తెలంగాణలో ఓబీసీ కులగణన నిర్వహించామని తెలిపారు.


బీజేపీపై మండిపాటు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘సర్’ విషయంలో ఆ పార్టీ తీరును తీవ్రంగా విమర్శించారు. ‘గతంలో సర్ ప్రక్రియ ఓటు హక్కు కల్పించడం కోసం ఉండేది. దీన్ని మోదీ మొదటిసారి ఓట్ల తొలగింపునకు ఉపయోగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ ఓటుహక్కు కల్పించింది. కానీ కేంద్రం ఈ హక్కును లాక్కుంటోంది. సర్ పేరుతో కనీసం 20 కోట్ల ఓట్లు తొలగించే అవకాశం ఉంది. 13 కోట్ల ఓట్లను ఇప్పటికే తీసేశారు. దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓట్లు తొలగిస్తున్నారు. ఈ వర్గాలు మొదటి నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉన్నాయి. అలాగే తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ బీఎల్ఓలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటిపేరు సరిగా లేకపోయినా ఓట్లను తొలగిస్తున్నారు. ఈ తొలగింపు ప్రక్రియ యాంత్రికంగా ఉంటోంది. బ్రిటిష్ హయాంలో సైమన్ కమిషన్‌లాగా మోదీ ‘సర్’ తీసుకువచ్చారు. సైమన్ కమిషన్ గోబ్యాక్ నినాదంలాగా ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ గో బ్యాక్ నినాదంతో ముందుకు రావాలి. ఓటుహక్కు లేనివాళ్లు, ఓటుహక్కు ఉన్నవాళ్లు.. ఇలా ప్రజలను రెండు రకాలుగా బీజేపీ విడదీస్తోంది. దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులను ఆ పార్టీ తయారు చేస్తోంది’ అని రేవంత్ ఆరోపించారు.

ప్రజాబలం

పీఏసీ సమావేశంలో ప్రజాబలం కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి చెప్పారు. సంక్రాంతి తరువాత ఇది మొదలవుతుందని తెలిపారు. దీన్ని 5 నెలల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికీ నాయకులు వెళ్లాలని సూచనలు చేశారు.


ఈ వార్తలూ చదవండి

పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 22 , 2026 | 05:01 PM