Share News

డైట్‌ కళాశాలలకు అధ్యాపకుల కొరత

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:14 AM

విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి అసెంబ్లీ సెగ్మెంట్‌కో యంగ్‌ ఇండియా స్కూల్‌, మండలానికి రెండేసి తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది.

డైట్‌ కళాశాలలకు అధ్యాపకుల కొరత

  • పది కాలేజీల్లో తొమ్మిదింటికి ప్రిన్సిపాళ్లే లేరు

నిజామాబాద్‌ , నవంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి అసెంబ్లీ సెగ్మెంట్‌కో యంగ్‌ ఇండియా స్కూల్‌, మండలానికి రెండేసి తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ముందుకు సాగుతోంది. కానీ, విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ శిక్షణ (డైట్‌) కళాశాలలను అధ్యాపకుల కొరత వెంటాడుతోంది. మెదక్‌తోపాటు రాష్ట్రంలోని 10 పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డైట్‌ కళాశాలల్లో డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎల్‌ఈడీ) కోర్సులో 2,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వారికి పాఠాలు చెప్పేందుకు 286 రెగ్యులర్‌ అధ్యాపకులు అవసరం కాగా ఆరుగురే ఉన్నారు. వీరిలో ప్రిన్సిపాల్‌ ఒకరు, మిగతా ఐదుగురు లెక్చరర్లు. మిగతా తొమ్మిది కాలేజీలకు ప్రిన్సిపాల్‌ పోస్టులతోపాటు మిగతా 280 పోస్టులు (70 సీనియర్‌ లెక్చరర్‌, 201 లెక్చరర్‌) ఖాళీగా ఉన్నాయి.


తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియంలలో విద్యాబోధన చేస్తున్న నిజామాబాద్‌ కాలేజీలో 30 రెగ్యులర్‌ పోస్టులకు ప్రిన్స్‌పాల్‌, ఒక లెక్చరరే ఉన్నారు. ఏడు సీనియర్‌ లెక్చరర్‌, 22 లెక్చరర్‌ పోస్టులు.. ఇంగ్లీష్‌ మీడియంలో 17 పోస్టులకు 16 పోస్టులు, ఉర్దూ మీడియంలో 5 పోస్టులు ఖాళీ. దీంతో వేర్వేరు మీడియంలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పూర్తిస్థాయి బోధన కష్టతరంగా మారింది. రెగ్యులర్‌ అధ్యాపకుల కొరతను అధిగమించడానికి ఫారిన్‌ సర్వీసు కింద ఆరుగురు, గెస్ట్‌ ఫ్యాకల్టీ, డిప్యుటేషన్‌ మీద ఇద్దరు చొప్పున తాత్కాలిక సర్దుబాటు చేసినా.. అన్ని సబ్జెక్టుల బోధనకు అధ్యాపకుల కొరత వెంటాడుతోంది.


తొలి సంవత్సరంలో 150 మంది, రెండో సంవత్సరంలో 138 మంది విద్యార్థులున్నారు. తాత్కాలిక సర్దుబాట్లకు పరిమితం కాకుండా శాశ్వత నియామకాలతో డైట్‌ కళాశాలల్లో బోధనా వ్యవస్థను బలోపేతం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. గత జూన్‌లో 86 పోస్టుల నియామకానికి నోటిపికేషన్‌ జారీ చేసి.. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినా.. ఇప్పటికీ రాత పరీక్ష నిర్వహణపై ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. దీంతో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా డైట్‌ కళాశాలల్లో శాశ్వత అధ్యాపకుల నియామకానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 04:14 AM