26 లోక్‌సభ.. 182 అసెంబ్లీ స్థానాలు!
ABN , Publish Date - Nov 28 , 2026 | 04:51 AM
నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించిన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందితే.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ప్రజాప్రాతినిధ్య ముఖచిత్రం మారుతుంది.
పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ ప్రాతినిధ్య ముఖచిత్రమిదే
అసెంబ్లీ సీట్ల పునర్విభజనలోనూ 50 శాతం పెంపు అమలు చేస్తే 179 స్థానాలు
మహిళలు, ద్వితీయ శ్రేణి నేతలకు చాన్స్
హైదరాబాద్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించిన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందితే.. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ప్రజాప్రాతినిధ్య ముఖచిత్రం మారుతుంది. ప్రధాన పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, మహిళలకు అవకాశాలు పెరుగుతాయి. బిల్లులు ఆమోదం పొందితే 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతి రాష్ట్రానికీ 50 శాతం సీట్లు పెరుగుతాయి. ప్రస్తుతం తెలంగాణకు 17 లోక్‌సభ స్థానాలున్నాయి. అవి 50 శాతం పెరిగితే.. ఎంపీ సీట్ల సంఖ్య 26 అవుతుంది. ప్రస్తుతం ఒక్కో లోక్‌సభ సీటుకూ ఏడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అదే నిష్పత్తిలో పెంచితే.. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గానికి ఏడు చొప్పున మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటవుతాయని చెబుతున్నారు. అలా కాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలోనూ 50 శాతం పెంపువిధానాన్ని అమలు చేస్తే.. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 179కి పెరుగుతుందని చెబుతున్నారు.
ఆ తర్వాతే..
నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా తొలుత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ను తేల్చిన తర్వాతనే.. మహిళా రిజర్వేషన్‌ను తేల్చనున్నారు. మొత్తం 26 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ కింద 4 సీట్లు రిజర్వు కానున్నాయి. ఎస్టీ రిజర్వుడు సీట్ల సంఖ్య మాత్రం 2గానే ఉంటుంది. ఇక అసెంబ్లీ సీట్లకు వస్తే 50 శాతం మేర సీట్ల పెంపుదలనే ప్రామాణికంగా తీసుకుంటే 179 స్థానాలకుగాను 27 సీట్లు ఎస్సీ రిజర్వుడు కానున్నాయి. ఎస్టీ సీట్లు 13కు చేరుకోనున్నాయి. 182 సీట్లను ప్రామాణికంగా తీసుకుంటే 28 సీట్లు ఎస్సీ రిజర్వుడు అవుతాయి. జనరల్ సీట్లతో పాటుగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయనున్నారు. దీంతో లోక్‌సభలో 26 సీట్లకుగాను 6, అసెంబ్లీలో 179 సీట్లకుగాను 60 సీట్లు మహిళలకు రిజర్వు కానున్నాయి. అంటే పెరగనున్న 60 సీట్లూ మహిళలకు రిజర్వు అవుతాయన్నమాట.
ఉమ్మడి రంగారెడ్డిలో డబుల్..!
నియోజకవర్గాల పునర్విభజన 2011 జనాభా ప్రాతిపదికన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. 2008 డీలిమిటేషన్ 2001 జనాభా ప్రాతిపదికన జరిగిన సంగతి తెలిసిందే. ఆ జనాబా లెక్కల ప్రకారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జనాభా 35.75 లక్షలుగా ఉంటే.. అది 2011 జనాభా లెక్కల ప్రకారం 52.96 లక్షలకు చేరుకుంది. అంటే ఏకంగా 48.1 శాతం పెరిగింది. కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 14 నియోజకవర్గాల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే ఆస్కారం ఉంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్నందున జీహెచ్‌ఎంసీతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో రెండు కార్పొరేషన్లలో భారీగాప్రాతినిధ్యం పెరగనుందంటున్నారు. మూడింట ఒక వంతు జనాభా ఉన్న హైదరాబాద్, శివారు ప్రాంతంలోనే 50కి పైగా అసెంబ్లీ నియోకవర్గాలు ఏర్పడే చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్