కార్మికుల పక్షమే..
ABN , Publish Date - May 02 , 2026 | 05:15 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సుల నిర్వహణలో డీజీల్ ఖర్చులు తగ్గించుకునేందుకే విద్యుత్ (ఈవీ) బస్సులను వాడుకలోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తాం
డీజిల్ ఖర్చులు తగ్గించుకునేందుకే ఈవీ బస్సులు.. సంస్థలో ఒక్క డ్రైవర్‌ను కూడా తగ్గించం
గాజులరామారంలో వంద ఎకరాల్లో బస్ టెర్మినల్.. శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్
వెయ్యి ఈవీ బస్సులు మెట్రోతో అనుసంధానం.. ఆర్టీసీకి మినీ బస్సులు కొనుగోలు చేసి ఇచ్చే యోచన
సమ్మె కేసుల ఎత్తివేత.. సమ్మె కాలానికి వేతనాలు.. సంస్థకు నష్టం జరిగే పనులు కార్మికులు చేయొద్దు
సంస్థ ఆగిపోతే ఊపిరి పోయినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రిని కలిసిన కార్మిక సంఘాల నేతలు
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) బస్సుల నిర్వహణలో డీజీల్ ఖర్చులు తగ్గించుకునేందుకే విద్యుత్ (ఈవీ) బస్సులను వాడుకలోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈవీ బస్సుల కారణంగా సంస్థలో ఏ ఒక్క డ్రైవర్‌నూ తగ్గించబోమని ప్రకటించారు. కార్మికులతోనే ప్రభుత్వం ఉంటుందని, వారి సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు మంచి సేవలందించే కార్యాచరణ కోసం ముందుకు వచ్చినందుకు అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లే దేశంలోనే గొప్ప సంస్థగా ఆర్టీసీ నిలిచిందన్నారు. ‘‘నేను వేరు, మీరు వేరు అనే భావన ఎన్నడూ లేదు. అందరం కలిస్తేనే ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేమూ ఉన్నాం’’ అని సీఎం అన్నారు. గాజులరామారంలో వంద ఎకరాల్లో బస్ టెర్మినల్, శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని, మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందజేయాలనుకుంటున్నామని చెప్పారు. డీజిల్‌పై ఆర్టీసీకి ఏటా రూ.2 వేల కోట్ల ఖర్చు అవుతుందని, ఈ ఖర్చును తగ్గించుకోవడానికే ఈవీ బస్సులు తెస్తున్నామని వెల్లడించారు.
బకాయిలు క్లియర్ చేస్తున్నాం..
ఆర్టీసీలో బకాయిలు తమ ప్రభుత్వ హయాంలో పెట్టినవి కావని సీఎం రేవంత్ అన్నారు. కానీ, వాటిని క్లియర్ చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈసారి ఉద్యోగులకు రూ.1000 కోట్ల బకాయిలు విడుదల చేశామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపడుతున్నామని, ఏవైనా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తే.. వెంటనే పరిష్కరించానని తెలిపారు. కార్మికులు, డిపో మేనేజర్ల మధ్య గ్యాప్ రాకుండా అధికారులు చూడాలన్నారు. సంస్థ ఆగిపోతే ఊపిరి పోయినట్లేనని, సంస్థకు నష్టం జరిగే పనులు చేయొద్దుని కార్మిక సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో యూనియన్లు, విలీనం అంశాల్లో శాశ్వత పరిష్కారానికి యూనియన్లు చర్చించుకుని ప్రభుత్వం ముందు ఆప్షన్ పెట్టాలని సీఎం సూచించారు. ఆర్థిక అంశాలతో కూడిన పీఆర్సీ వంటి విషయాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆర్టీసీ అప్పులపై ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, సంస్థను బలోపేతం చేసుకుని నిలబెట్టుకునేందుకు కార్మికులు సహకరించాలని కోరారు. మహాలక్ష్మి పథకంతో రూ.8 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు.
సమ్మె కేసుల ఎత్తివేత..
సమ్మె కాలంలో ఆర్టీసీ కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేయగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను, అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్(ఆర్), టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, టీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, టీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, టీఎస్ ఆర్టీసీ కార్మిక పరిషత్, టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, టీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘ్, టీఎస్ ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్, టీఎస్ ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఉన్నారు.
సీఎం రేవంత్ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు
బుద్ధపూర్ణిమ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బుద్ధ భగవానుడు మానవాళికి అందించిన కరుణ, దయ, సహనం, శాంతి మార్గాలు నేటి సమాజానికి మార్గదర్శనం చేస్తున్నాయని పేర్కొన్నారు. సమైక్య జీవనం, శాంతి మార్గాన్ని ఎంచుకుని ముందుకు నడవాలని ఆయన ఆకాంక్షించారు.